USA: తొలిసారి కలుసుకున్న కిమ్, ట్రంప్... చిత్రాలు చూడండి!
- సింగపూర్ లోని కెపెల్లా హోటల్ లో కలయిక
- తొలుత ఏకాంతంగా చర్చించనున్న కిమ్, ట్రంప్
- ఆపై అధికారుల సమక్షంలో ద్వైపాక్షిక చర్చలు
నిన్నటివరకు ఉప్పూ నిప్పుగా వున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్, తొలిసారిగా కలుసుకున్నారు. వారి కరచాలనం ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సింగపూర్ లోని కేపెల్లా హోటల్ లో వీరు ఇరువురూ కలిశారు. ఆపై రెండు దేశాల మధ్యా శిఖరాగ్ర చర్చలు ప్రారంభమయ్యాయి.
నిన్న మొన్నటి వరకూ వరుస అణ్వస్త్ర ప్రయోగాలు, అమెరికాపై అణు బాంబులు వేస్తామన్న బెదిరింపులతో కిమ్, ఉత్తర కొరియాను నామరూపాల్లేకుండా చేస్తామని ట్రంప్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునేవారన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తమ తమ పట్టుదలలు వీడి, చర్చలకు ముందుకు రావడం, దానికన్నా ముందే తన దేశంలోని అణు పరీక్షా కేంద్రాన్ని కిమ్ మూసివేయడంతో చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడింది.
ఇక తొలుత ఏకాంతంగా సమావేశమై చర్చలు జరిపే ఇరు దేశాధినేతలూ, ఆపై అధికారుల సమక్షంలో చర్చలు సాగించనున్నారు. వీరి సమావేశంపై ప్రపంచమంతటా ఆసక్తి నెలకొనివుండగా, చర్చల తరువాత ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయన్నది నేడు తేలనుంది.