YSRCP: బీసీలను టీడీపీకి దూరం చేయాలన్న వైసీపీ కుట్రలు ఫలించవు: మంత్రి యనమల
- బీసీలతో వైసీపీ ఆత్మీయ సమావేశం విడ్డూరం
- టీడీపీ విధానాల వల్ల బీసీలలో ఆత్మగౌరవం పెరిగింది
- వైసీపీ, జనసేన పార్టీలతో బీజేపీ రహస్య ఒప్పందం చేసుకుంది
బీసీలతో వైసీపీ ఆత్మీయ సమావేశం విడ్డూరంగా ఉందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీసీలకు వైసీపీ చేసేదేమీ ఉండదని, బీసీలను టీడీపీకి దూరం చేయాలన్న వైసీపీ కుట్రలు ఫలించవని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బీసీ సంక్షేమానికి నిధులు ఇవ్వలేదని, నాలుగేళ్లలో బీసీలకు రూ.36 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
టీడీపీ విధానాల వల్ల బీసీలలో ఆత్మగౌరవం పెరిగిందని, ఈ సందర్భంగా బీజేపీపైనా ఆయన విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత నెలకొందని, అన్నారు. ఏపీలో వైసీపీ, జనసేన పార్టీలతో బీజేపీ రహస్య ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు.
కాగా, మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, బీసీలకు వైస్ జగన్ శత్రువు అని, బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో రెండు బీసీ ఫెడరేషన్ లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని అన్నారు. అత్యంత కీలకమైన శాఖలను బీసీలకు అప్పగించిన ఘనత టీడీపీదేనని అన్నారు.