world tarde center: న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద 80 అంతస్తుల ఆకాశహర్మ్యం సిద్ధం!

- 1,079 అడుగుల ఎత్తయిన భవంతి
- 2.7 బిలియన్ డాలర్లతో నిర్మాణం
- రేపు ప్రారంభం
న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ సముదాయం ప్రాంతంలో నిర్మించిన మూడో భారీ బహుళ అంతస్తుల వాణిజ్య టవర్ ప్రారంభానికి సిద్ధమైంది. 80 అంతస్తుల ఈ ఆకాశ హర్మ్యాన్ని రేపు ప్రారంభించనున్నారు. 1,079 అడుగుల పొడవైన ఈ స్కైస్క్రాపర్ ను 2.7 బిలియన్ డాలర్లతో నిర్మించారు. రిచర్డ్ రోగర్స్ అనే ఆర్కిటెక్ట్ దీన్ని డిజైన్ చేశారు. న్యూయార్క్ నగరంలో ఇది ఐదో అత్యంత ఎత్తయిన భవంతి.
2001 సెప్టెంబర్ 11న ఉగ్రవాదులు హైజాక్ చేసిన విమానాలతో న్యూయార్క్ నగరంలో ఉన్న జంట టవర్లను కూల్చివేసిన విషయం తెలిసిందే. నాటి ఘటనలో 2,977 మంది ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా అదే ప్రదేశంలో ఇప్పుడీ భవంతిని నిర్మించారు. నిధుల లేమి, ఇతర అంశాల కారణంగా ఇది చాలా కాలం పాటు నిలిచిపోయింది. అయితే, ఎట్టకేలకు టవర్ నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ టవర్లో 62 అడుగుల మేర లాబీ, నేషనల్ సెప్టెంబర్ 11 మ్యూజియం ఉన్నాయి.