Uttarakhand: ఎగిరే బెలూన్ ద్వారా ఇంటర్నెట్... ఉత్తరాఖండ్ లో ప్రయోగాత్మకంగా ప్రారంభం
- గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించే లక్ష్యం
- ఒక్కో బెలూన్ తో ఏడున్నర కిలోమీటర్ల పరిధిలో సేవలు
- రూ.50 లక్షల వ్యయం... ప్రారంభంలో ఉచితంగానే సేవలు
పర్వత ప్రాంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటర్నెట్ సేవలను ఎగిరే బెలూన్ల ద్వారా ఇచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఇంటర్నెట్ బీమింగ్ బెలూన్లతో ఇంటర్నెట్ సేవలను అందజేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా డెహ్రాడూన్ లోని ఐటీ పార్క్ లో ఒకదాన్ని ప్రారంభించింది. బెలూన్ గాల్లో పైకి తేలి ఉండేందుకు హైడ్రోజన్ వాయువును ఉపయోగించారు.
ఆరు మీటర్ల పొడవు ఉండే ఈ బెలూన్ (ఎయిరో స్టాట్) 14 రోజుల పాటు గాల్లో తేలుతూ ఉంటుందని ఈ ప్రాజెక్టును చేపట్టిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) డైరెక్టర్ అమిత్ సిన్హా తెలిపారు. ఐఐటీ బాంబే ఈ టెక్నాలజీని సమకూర్చింది. ఒక్కో ఎయిరో స్టాట్ ఖరీదు రూ.50 లక్షలు అవుతుందని, ఇది 7.5 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలను అందిస్తుందని అమిత్ సిన్హా తెలిపారు. 5 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ వేగంతో ఇంటర్నెట్ సేవలను అందించగలదని వివరించారు. ప్రారంభంలో సేవలు ఉచితమేనని, ఎవరైనా వైఫై ద్వారా కనెక్ట్ అయి ఇంటర్నెట్ ను వినియోగించుకోవచ్చని సూచించారు.