RBI: నోట్ల రద్దు ఎఫెక్ట్.. ప్రజల వద్దే రూ.18.5 లక్షల కోట్లు.. ఆందోళనలో ఆర్బీఐ!
- ప్రజలను ఇంకా వెంటాడుతున్న నోట్ల రద్దు భయం
- డిపాజిట్‌కు వెనుకంజ
- ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ లేవన్న ఆర్బీఐ
నోట్ల రద్దుతో బెంబేలెత్తిన ప్రజలు ఇప్పుడు బహు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పుడు వెళ్లినా ఖాళీగా కనిపించే ఏటీఎంలు, డబ్బులు లేని బ్యాంకుల చుట్టూ తిరగడం దండగనే అభిప్రాయానికి వచ్చి అటువైపు వెళ్లడాన్నే మానుకున్నారు. డబ్బును తమ వద్దే భద్రంగా దాచుకుంటున్నారు. అలా దాచుకున్న డబ్బు ప్రజల వద్ద ఏకంగా రూ.18.5 లక్షల కోట్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
అక్టోబరు 2016లో ప్రజల వద్ద రూ.17 లక్షల కోట్లు ఉండిపోయిందని, ఇది ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు వాటిల్లుతుందని భావించిన ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఫలితంగా ప్రజల వద్ద ఉన్న సొమ్ము తిరిగి బ్యాంకులకు చేరింది.
నోట్ల రద్దుతో చేతిలో చిల్లిగవ్వ లేక నానా ఇబ్బందులు పడిన ప్రజలు.. తిరిగి చలామణి ఊపందుకోగానే జాగ్రత్త పడడం మొదలుపెట్టారు. తమ వద్ద కొచ్చిన డబ్బులను ఎంచక్కా ఇంట్లోనే భద్రపరుచుకుంటున్నారు. ఫలితంగా నోట్ల రద్దుకు ముందు ప్రజల వద్ద ఉన్న సొమ్ముకంటే లక్షన్నర కోట్లు అధికంగా పోగు అయింది. స్వయంగా భారతీయ రిజర్వు బ్యాంకు ఈ విషయాన్ని వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. నోట్ల రద్దుకు ముందు, ఆ తర్వాత కూడా ఇంత దారుణమైన పరిస్థితులు లేవని ఆర్బీఐ పేర్కొంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని విలువల నోట్లను కలుపుకుంటే మొత్తం రూ.19.3 లక్షల కోట్లు చలామణిలో ఉందని ఆర్బీఐ తెలిపింది. అయితే, తమ వద్దకు చేరిన డబ్బును ప్రజలు తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు వెనకాడుతుండడంతో రూ.18.5 లక్షల కోట్లు వారి వద్దే ఉండిపోయాయని ఆర్బీఐ తెలిపింది.