Polavaram: ‘పోలవరం’లో కీలక నిర్మాణం పూర్తి.. డయాఫ్రమ్‌వాల్ సిద్ధం!
- 412 రోజుల్లో డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేసిన అధికారులు
- మొత్తం ఖర్చు రూ.430 కోట్లు
- నేడు పైలాన్‌ను ఆవిష్కరించనున్న చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రమ్‌వాల్ నిర్మాణం పూర్తయింది. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేశారు. గతేడాది ఫిబ్రవరి 1న సీఎం చంద్రబాబు ఈ పనులను ప్రారంభించగా రూ.430 కోట్ల ఖర్చుతో 412 రోజుల్లో దీనిని పూర్తిచేసి శభాష్ అనిపించారు. ప్రాజెక్టు హిల్‌వ్యూ కొండపై ఏర్పాటు చేసిన పైలాన్‌ను నేడు సీఎం ఆవిష్కరించనున్నారు.
అసలేంటీ డయాఫ్రమ్‌వాల్?
దీనిని గోదావరి నదీ గర్భంలో నిర్మించారు. ఒక రకంగా ఇంటి నిర్మాణానికి పునాది ఎంత ముఖ్యమో ఇదీ అంతే. 150 అడుగుల ఎత్తులో నిర్మించే ఎర్త్‌కమ్ రాక్ ఫిల్‌డ్యామ్‌లో 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఈ నీరు దిగువన 93 మీటర్ల లోతు వరకూ లీక్ కాకుండా ఈ వాల్ అడ్డుకుంటుంది. అందుకనే ప్రాజెక్టు నిర్మాణంలో ఇది అత్యంత కీలకంగా మారింది.
నదీ గర్భంలో జరిగే మార్పులను తట్టుకునేలా దీని నిర్మాణంలో ప్లాస్టిక్ కాంక్రీట్‌ను వాడారు. విపత్తులు వచ్చి వాల్‌పై ఒత్తిడి పెరిగినా తట్టుకుని నిలబడుతుంది. భూకంపం వచ్చి సంకోచ, వ్యాకోచాలు చెందినా గోడకు ఎటువంటి ప్రమాదం వాటిల్లదని, తిరిగి మామూలు స్థితికి మారిపోతుందని నిపుణులు తెలిపారు. దీని నిర్మాణంలో మొత్తం 1.18 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించారు.