airtel: రూ.149కే రోజూ 2జీబీ 4జీ డేటా... ఎయిర్ టెల్ మరో కొత్త ఆఫర్
- ప్రత్యర్థి జియో రూ.149 ప్లాన్ కంటే అదనపు డేటా
- కొన్ని సర్కిళ్లలోనే ప్రస్తుతానికి అమల్లోకి
- కస్టమర్లను నిలుపుకునేందుకు తంటాలు
రిలయన్స్ జియోకు పోటీగా భారతీ ఎయిర్ టెల్ ఓ కొత్త ప్లాన్ ను ప్రకటించింది. కేవలం రూ.149కే 28 రోజుల పాటు ప్రతీ రోజు 2జీబీ 3జీ/4జీ డేటాను ఆఫర్ చేసింది. అయితే, ప్రస్తుతం కొన్ని సర్కిళ్లలోనే ఈ ప్లాన్ అమల్లోకి రాగా, త్వరలో అన్ని సర్కిళ్లలోకి రానుందని మార్కెట్ వర్గాల సమాచారం. రిలయన్స్ జియో రెండేళ్ల క్రితమే మార్కెట్లోకి అడుగు పెట్టినప్పటికీ కస్టమర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటూ వెళుతోంది. దీంతో మార్కెట్లో టాప్ ప్లేయర్స్ గా ఉన్న ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ పై గట్టి ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో పోటీ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఆకర్షణీయ ప్లాన్లను ప్రకటిస్తున్నాయి.
రిలయన్స్ జియో రూ.149 రీచార్జ్ చేసుకున్న వారికి ప్రతి రోజూ 1.5 జీబీ 4జీ డేటాను 28 రోజుల పాటు ఆఫర్ చేస్తోంది. దీనికి పోటీగా ఎయిర్ టెల్ ప్రతి రోజూ అదనంగా మరో అర జీబీ డేటాతో మొత్తం 2జీబీ డేటాతో కూడిన ప్లాన్ ను తీసుకొచ్చినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల కస్టమర్లు చేజారిపోకుండా ఉంటారని, కొత్త కస్టమర్లను ఆకర్షించొచ్చని ఎయిర్ టెల్ భావిస్తోంది. ఇంతకుముందు వరకు రూ.149 రీచార్జ్ పై ఎయిర్ టెల్ కేవలం ప్రతి రోజూ ఒక జీబీ డేటానే ఆఫర్ చేసింది.