Jana Sena: పవన్‌ కల్యాణ్‌ యాత్రకు కొన్ని రోజుల విరామం.. ఎల్లుండి హైదరాబాద్‌కు జనసేనాని!

  • విశాఖ జిల్లాలో పవన్‌
  • మేధావులతో చర్చలు
  • పలు అంశాలపై అధ్యయనం

జనసేన నిర్వహిస్తోన్న పోరాట యాత్రకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్  కొన్ని రోజుల పాటు విరామం ఇచ్చారు. నిన్న రాత్రి విశాఖపట్నం జిల్లాలోని ఎలమంచిలి సభను ముగించుకున్న ఆయన.. ఈరోజు ఉదయం నుంచి విశాఖకు చెందిన కొందరు మేధావులతో సమావేశం అవుతున్నారని ఆ పార్టీ మీడియా హెడ్‌ హరిప్రసాద్‌ పేరిట విడుదల చేసిన ఓ ప్రకటనలో జనసేన తెలిపింది. పవన్‌ను కలిసిన వారిలో ఉత్తరాంధ్రలో వెనుకబాటు తనం సమసిపోవడానికి అవిశాత్రంగా పోరాటం చేస్తోన్న కుప్పం యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్, యూనియన్ పబ్లిక్ కమిషన్ లో సేవలు అందించిన ప్రొఫెసర్ కేఎస్ చలం కూడా ఉన్నారని పేర్కొన్నారు.

రేపు, ఎల్లుండి కూడా విశాఖ నగరానికి చెందిన వివిధ వర్గాల వారిని పవన్ కల్యాణ్ కలుస్తారని తెలిపింది. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంపై వివిధ వర్గాల మేధావులతో పవన్ చర్చలు జరిపి, పలు అంశాలపై అధ్యయనం కోసం ఈ మూడు రోజుల కాలాన్ని ఉపయోగించుకుంటున్నారని జనసేన పేర్కొంది. ఉత్తరాంధ్రలోని జన సైనికులకు ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంపై అవగాహన కల్పించే విషయంపై ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని తెలిపింది.

ఇదిలా ఉండగా ఆయన వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కువ సంఖ్యలో ముస్లిం సోదరులు ఉన్నందున రంజాన్ పండగను దృష్టిలో ఉంచుకునే పవన్‌ ఈ విరామాన్ని ప్రకటించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రంజాన్ పండుగ అనంతరం జనసేన పోరాట యాత్ర విశాఖ జిల్లాలో యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది. ఎల్లుండి సాయంత్రం పవన్ కల్యాణ్ విశాఖ నుంచి హైదరాబాద్ కు పయనమవుతారని తెలిపింది.

  • Loading...

More Telugu News