Nara Lokesh: పవన్ కల్యాణ్ వీడియోను పోస్ట్ చేసి.. సమాధానం చెప్పిన నారా లోకేశ్!
- ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా పెట్టుబడులు పెడితే స్వాగతం
- ఎర్ర తివాచీ వేసి ఆహ్వానిస్తాం
- అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం
- కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానికులకు భూములివ్వకుండా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే వ్యక్తికి ఇచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోను ఏపీ మంత్రి నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, ఆయనకు వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా పెట్టుబడులు పెట్టి, ఉద్యోగాలు సృష్టించాలనుకుంటే వారికి ఎర్ర తివాచీ వేసి స్వాగతం పలుకుతామని ట్వీట్ చేశారు. అటువంటి వారిని తాను స్వయంగా ఆహ్వానించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నానని చెప్పారు.
కాగా, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇవ్వలేదని, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అన్నది ఫార్చూన్ 500 కంపెనీల్లో ఒకటని లోకేశ్ చెప్పారు. రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టి 2400 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతోందని, స్థానిక పారిశ్రామిక వేత్తలకు అన్యాయం జరుగుతోందని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విశాఖపట్నంలో పల్సస్ టెక్ సంస్థకు భూమి కేటాయించామని, ఆ కంపెనీ సీఈవో శ్రీనిబాబుది శ్రీకాకుళమేనని అన్నారు.