Karnataka: ఒక్కోసారి మనం త్యాగం చేయక తప్పదు!: మంత్రివర్గ శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ నేత ఖర్గే
- న్యాయం చేయాల్సిన అవసరం ఉంది
- అసంతృప్త ఎమ్మెల్యేలతో వారి ప్రతినిధులు, అధిష్ఠానం మాట్లాడాలి
- ప్రజాస్వామ్య పరిరక్షణ నిమిత్తం ఒక్కోసారి త్యాగం తప్పదు
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వాన్ని కుమారస్వామిగౌడ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కర్ణాటక కేబినెట్ లో శాఖల కేటాయింపునకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పన్నెండు మంది తిరుగుబాటు చేస్తున్నారు. ఈ విషయమై ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే స్పందించారు.
శాఖల కేటాయింపు విషయంలో తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలతో వారి ప్రతినిధులు, పార్టీ అధిష్ఠానం మాట్లాడాల్సిన అవసరం ఉందని సూచించారు. అదే విధంగా తమకు అవకాశాలు లభించకపోవడానికి గల కారణాలను, అధిష్ఠానం ఇలా ఎందుకు నిర్ణయం తీసుకుందనే విషయాన్ని అసంతృప్త ఎమ్మెల్యేలు ఆలోచించాలని సూచించారు.
రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ నిమిత్తం ఒక్కోసారి మనం త్యాగం చేయక తప్పదని సూచించారు. హోమ్ శాఖ దక్కలేదని ఫిర్యాదు చేసిన తమ ఎమ్మెల్యేలు పార్టీని వీడే ప్రసక్తే లేదని, విధేయులుగా ఉంటామని పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు.