Andhra Pradesh: ప్రజలందరి సంతృప్తే మా అభిమతం: మంత్రి యనమల
- విజయవంతంగా నాలుగేళ్ల పాలన
- నాలుగేళ్లలో సంక్షేమానికి రూ.5,20,237 కోట్లు ఖర్చు
- కేటాయింపులను పూర్తి స్థాయిలో వినియోగించిన ప్రభుత్వం మాదే
ఏపీ ప్రజలందరూ సంతృప్తిగా ఉండాలనేదే తమ అభిమతమని, ఇందుకోసం గత నాలుగేళ్లలో ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5,20,237 కోట్లను ఖర్చు చేసిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను వివరించారు.
సచివాలయంలోని తన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో నాలుగేళ్ల నుంచి స్థిరంగా డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిన రాష్ట్రం ఏపీయేనని అన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ బకాయిల కింద మొదట విడతగా రూ.260 కోట్లు తక్షణమే విడుదల చేయనున్నట్టు తెలిపారు. నగదు రూపంలో నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో ఆ మొత్తం జమ చేయనున్నామని, పెన్షనర్లకు రూ.715 కోట్లు, సీపీఎఫ్ కింద రూ.730 కోట్లు త్వరలో చెల్లించనున్నట్టు చెప్పారు. ఎన్టీఆర్ భరోసా కింద మరో 3.50 లక్షల పెన్షన్లు ఇవ్వనున్నట్లు యనమల తెలిపారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తున్నామని, రాష్ట్రంలో 103 సంక్షేమ పథకాలు పగడ్బందీగా అమలు చేస్తున్నామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుతుందని, పాలన విజయవంతంగా సాగుతోందని చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా రాష్ట్రం తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉందని, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, ఈ నాలుగేళ్లలో 103 సంక్షేమ పథకాల అమలు చేశామని చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5,20,237 కోట్లను ఖర్చు చేసిందని, ఏడాదికి లక్షా 30 వేల కోట్ల చొప్పున సంక్షేమానికి ఖర్చు చేశామని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ బడ్జెట్ కేటాయింపులను 100 శాతం మేరకు వినియోగించిన దాఖాలాలు లేవని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 109 శాతం మేర బడ్జెట్ కేటాయింపులు వినియోగించిందని, గత నాలుగేళ్ల మాదిరిగా రాబోయే ఏడాది కూడా విజయవంతమైన పాలన అందిస్తామని అన్నారు.
మరో 3.50 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తాం
రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద వితంతువులకు, కళాకారులకు, కిడ్నీ బాధితులకు 50 లక్షల పింఛన్లు అందిస్తున్నామని యనమల రామకృష్ణుడు తెలిపారు. రాష్ట్రంలో మరింత మంది పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మరో 3.50 లక్షల పెన్షన్లు మంజూరు చేయనున్నామని, త్వరలో అర్హులకు ఈ పెన్షన్లు అందజేస్తామని, రాష్ట్రంలో ఉన్న మున్సిపాల్టీలలో 200 లకు పైగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పట్టణ, గ్రామాల్లో 19 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని, రూ.1000 కోట్లతో యూత్ పాలసీ రూపొందించామని, చంద్రన్న కానుకలు, చంద్రన్న పెళ్లి కానుకలు వంటి పథకాలపై ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా అమలు చేశామని చెప్పారు.
క్యాపిటల్ ఎక్స్ పిండేచర్ కింద రూ.42,268 కోట్లు వ్యయం చేశామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద ఖర్చు చేయలేదని యనమల తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రాష్ట్రం తీవ్ర ఆర్థికలోటులో ఉన్నా వారు అడిగిందల్లా చేశామని, ఉద్యోగుల 25 రకాల కోరికలను తీర్చామని చెప్పారు. పీఆర్సీ కింద రూ.3,919 కోట్లు చెల్లించాల్సి ఉందని, దీనిపై ఎన్జీవో, ఉద్యోగ సంఘాలతో మాట్లాడి, రెగ్యులర్ ఉద్యోగులకు మొదటి విడతగా రూ.260 కోట్లు క్యాష్ రూపంలో వారి ఖాతాల్లో జమచేయనున్నట్లు మంత్రి తెలిపారు.
పెన్షనర్లకు రూ.715 కోట్లు, సీపీఎఫ్ కింద రూ.730 కోట్లు చెల్లించనున్నామని, తద్వారా ప్రభుత్వంపై రూ.1,710 కోట్ల భారం పడనుందని, పనిచేసిన వారికే జీతాలు చెల్లించడానికే సీఎఫ్ఎంఎస్ పధ్ధతి అమలు చేస్తున్నట్టు యనమల తెలిపారు. ఎకానమిక్ గ్రోత్ లో దేశంలో ఏపీ నెం.1గా నిలిచిందని, దీనిలో వ్యవసాయ అభివృద్ధే అగ్రస్థానమని, పారిశ్రామిక రంగంలోనూ అభివృద్ధి సాధించామని చెప్పారు. సర్వీసెస్ రంగంలో ఆశించిన మేరలో అభివృద్ధి సాధించలేదని, దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలో పట్టణీకరణ స్వల్పంగా ఉండడం వల్లేనని, 2014-15లో రూ.93,699లు పెర్ క్యాపిటల్ ఇన్ కమ్ రాగా, 2017-18లో రూ.1,42,054లు వచ్చిందని చెప్పారు.
దీనికి కారణం వ్యవసాయంలో అభివృద్ధేనని, వ్యవసాయంలో గ్రోత్ కారణంగా రాష్ట్రంలో గ్రామీణుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత వ్యవసాయంలో అధిక వృద్ధిరేటు సాధిస్తున్నామని, వ్యవసాయంలో 34.04 శాతం, పారిశ్రామిక రంగంలో 22.10 శాతం, సర్వీసెస్ రంగంలో 43.50 శాతం అభివృద్ధి సాధించామని అన్నారు. దేశ వ్యాప్త గ్రోత్ రేట్ లో 2014-15లో ఏపీ రెండో ర్యాంకు సాధిస్తే, 2015-16లో మొదటి స్థానంలో నిలిచిందని, 2016-17లో రెండో ర్యాంకు, 2017-18లో మొదటి ర్యాంకు సాధించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదుకోకున్నా మొదటి ర్యాంకు సాధించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శమని, వ్యవసాయాభివృద్ధిలో ఏపీతో మధ్యప్రదేశ్ పోటీపడుతోందని అన్నారు.
ఆర్బీఐని చేతిలో పెట్టుకుని కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ని కేంద్ర ప్రభుత్వం తన చేతిలో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన రూ.350 కోట్లు తిరిగి తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇది బ్యాంకు నిబంధనలకు వ్యతిరేకమని, నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.12,879 కోట్లు వచ్చాయని, లోటు బడ్జెట్ కింద మరో రూ.12 వేల కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. దీంతో పాటు చట్టప్రకారం రావాల్సినవి, విభజన సందర్భంగా పార్లమెంట్ లో ఇచ్చిన హామీల మేరకు నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడంలేదని అన్నారు.
ఉష్ణపక్షిలా ప్రతిపక్షం విమర్శలు
ఇసుకలో తల దూర్చి ప్రపంచాన్ని పట్టించుకోని ఉష్ణ పక్షిలా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని పట్టించుకోకపోవడం, నిజాలను గుర్తించకపోవడం ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయని యనమల ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి ఈ నాలుగేళ్లలో జరిగినా, ఏమీ జరగనట్లు ప్రజలను వంచించడం హాస్యాస్పదమని అన్నారు. నిజాలను ఒప్పుకునే పరిస్థితుల్లో విపక్షాలు లేవని, కేంద్రం తీరుపై విపక్ష నేతలెవరూ మాట్లాడడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై ఛార్జిషీట్ విడుదల చేస్తాననడం అవివేకమని అన్నారు.
నాలుగేళ్ల నుంచి ఏటా డబుల్ డిజిట్ గ్రోత్ సాధించడం అభివృద్ధి కాదా? అని ఆయన ప్రశ్నించారు. మెథడాలజీ ప్రకారం గ్రోత్ రేట్ లెక్కిస్తారని, రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ఇప్పుడు వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించినా ఎన్నికలు రావని, ఎంపీలు రాజీనామా పత్రాలిచ్చినా, మరోసారి కన్ఫర్మేషన్ లెటర్లు అడగడం పార్లమెంట్ చరిత్రలోనే మొదటిసారి అని అన్నారు.