yeddyurappa: కుమారస్వామి, యెడ్యూరప్పల మధ్య మాటల తూటాలు!

  • 55 గంటలు సీఎంగా ఉన్న యెడ్యూరప్ప
  • హెలికాప్టర్ ఖర్చు రూ. 13.50 లక్షలు
  •  ఆ ఖర్చును స్వయంగా భరిస్తానన్న యెడ్డీ

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్పల మధ్య హెలికాప్టర్ వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో, ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. కేవలం 55 గంటలు మాత్రమే సీఎంగా ఉన్న యెడ్యూరప్ప హెలికాప్టర్ లో పర్యటించేందుకు రూ. 13.50 లక్షలు ఖర్చు చేశారని కుమారస్వామి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై యెడ్డీ ఘాటుగా స్పందించారు. సీఎంకు ఓ లేఖాస్త్రాన్ని సంధించారు.

స్వామీజీలంటే తనకు ఎంతో గౌరవమని... మే 21వ తేదీన మహంత శివయోగి దివంగతులైనందుకు బాగల్ కోటె జిల్లాకు అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చిందని, అదే విధంగా దావణగెరె జిల్లా చెన్నగిరిలో రైతు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళ్లానని లేఖలో తెలిపారు. కావాలంటే ఆ ఖర్చును తాను స్వయంగా భరిస్తానని చెప్పారు. బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా ఇలాంటి విమర్శలు చేయడం తగదని సూచించారు.

దీనిపై కుమారస్వామి మాట్లాడుతూ, యడ్యూరప్ప లేఖ తనకు ఇంకా చేరలేదని చెప్పారు. ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ను వినియోగించినందుకు తాను విమర్శలు చేయలేదని అన్నారు. ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చినా తాను ప్రత్యేక విమానాన్ని ఉపయోగించలేదని, ప్రత్యేక విమానంలో వెళ్తే రూ. 40 లక్షలు ఖర్చవుతుందని చెప్పానన్నారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News