jana reddy: జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతల సమావేశం.. కీలక అంశాలపై చర్చ!
- శాసనసభ సభ్యత్వాల రద్దుపై చర్చ
- చర్చకు వచ్చిన దామోదర్ రెడ్డి పార్టీ మారే అంశం
- గైర్హాజరైన డీకే అరుణ, పొంగులేటి తదితరులు
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసంలో ఆ పార్టీకి చెందిన నేతలు సమావేశమయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ల శాసనసభ సభ్యత్వాల రద్దుపై కోర్టు తీర్పు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వీరు చర్చిస్తున్నారు. దీంతోపాటు సీనియర్ నేత దామోదర్ రెడ్డి పార్టీ మారుతున్న అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్, రేవంత్ రెడ్డి, సంపత్, షబ్బీర్ అలీ, గీతా రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, జీవన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించినా... ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై నేతలు చర్చించారు. కోర్టు తీర్పును ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై చర్చలు జరిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి ఎలా పెంచాలనే విషయంపై చర్చించారు. ఈ సమావేశానికి డీకే అరుణ, చిన్నారెడ్డి, పొంగులేటి తదితరులు గైర్హాజరయ్యారు. డీకే అరుణకు తన నియోజకవర్గంలో ఇంతకు ముందే నిర్ణయించిన కార్యక్రమం ఉండటంతో హాజరుకాలేకపోయారు. సమావేశానికి హాజరుకాలేనని దామోదర్ రెడ్డి చెప్పినట్టు సమాచారం.