women safety device: మహిళల భద్రత కోసం డివైజ్... మిలియన్ డాలర్ల బహుమానం
- రూపొందించిన ఢిల్లీకి చెందిన లీఫ్ వేరబుల్స్
- 2012 నిర్భయ ఘటన స్ఫూర్తితో అభివృద్ధి
- వీరి కృషిని గుర్తించిన అమెరికా దాతృత్వకారులు
మహిళల భద్రత కోసం ఓ పరికరాన్ని రూపొందించిన భారతీయ యువ ఔత్సాహిక వ్యాపారవేత్తలకు మిలియన్ డాలర్ల (రూ.6.6 కోట్లు) బహుమానం వరించింది. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో ‘నిర్భయ’పై జరిగిన దారుణ అత్యాచార ఘటన గుర్తుండే ఉంటుంది. దీన్నుంచే స్ఫూర్తి పొందిన ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు లీఫ్ వేరబుల్స్ పేరుతో ఓ కంపెనీ ఆరంభించారు. మహిళలు ఆపదలో ఉంటే రక్షణ కోసం గాను ధరించే ఓ పరికరాన్ని కేవలం 40 డాలర్ల వ్యయానికే రూపొందించారు. ఇది ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. అత్యవసర సమయాల్లో మహిళలు ఆపదలో ఉంటే ఆ సమాచారాన్ని 90 సెకండ్లలోనే కమ్యూనిటీ రెస్పాండర్లకు తెలియజేస్తుంది.
మహిళల భద్రత కోసం వీరు చేసిన ఆవిష్కరణను అమెరికాలోని భారతీయ దాతృత్వకారులు అను, నవీన్ జైన్ గుర్తించారు. ‘వుమెన్స్ సేఫ్టీ ఎక్స్ ప్రైజ్’ పేరుతో మిలియన్ డాలర్ల బహుమతిని నిన్న జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. 18 దేశాల నుంచి 85 బృందాలు పోటీపడగా, అంతిమంగా ప్రైజు గెలుచుకున్న బృందం లీఫ్ వేరబుల్స్ కావడం గమనార్హం. లీఫ్ వేరబుల్స్ తరఫున ఈ బహుమతిని మానిక్ మెహతా, నిహారికా రాజీవ్, అవినాష్ బన్సల్ అందుకున్నారు.