rajnikanth: చాలా కాలం తర్వాత సౌదీ అరేబియాలో విడుదలవుతున్న భారతీయ చిత్రం ‘కాలా’!
- ట్వీట్ చేసిన ధనుష్, ఐశ్వర్య
- సౌదీలో 35 ఏళ్ల పాటు నిలిచిన సినిమా ప్రదర్శనలు
- ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తిరిగి ప్రారంభం
రజనీకాంత్ ‘కాలా’ సినిమా రివ్యూ ఎలా ఉన్నప్పటికీ, ఈ చిత్రం మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. సౌదీ అరేబియాలో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రం ఇదే కానుంది. నిజానికి 1980ల్లోనే సౌదీ అరేబియాలో సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు. సినిమాల ప్రదర్శన ఇస్లాంలో జోక్యం చేసుకోవడమేనంటూ వచ్చిన ఒత్తిళ్లకు అక్కడి ప్రభుత్వం తలవొగ్గింది. 35 ఏళ్ల విరామం తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ లో తిరిగి అక్కడ సినిమా ప్రదర్శనలు మొదలయ్యాయి. మొదటి చిత్రంగా బ్లాక్ పాంథర్ విడుదలైంది.
ఇక స్వదేశంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాలా సినిమా విడుదలకు నోచుకోలేకపోతుండగా... పూర్తిగా సంప్రదాయవాదం ప్రబలంగా ఉన్న సౌదీ అరేబియాలో ప్రదర్శనకు వెళుతుండడం నిజంగా ఆలోచించతగినదే. దీనిపై రజనీకాంత్ అల్లుడు ధనుష్, కుమార్తె ఐశ్వర్య ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘‘ఇది చాలా పెద్ద విషయం. సౌదీ అరేబియా రాజ్యంలో విడుదల అవుతున్న మొదటి భారతీయ సినిమా కాలా. ఇది కేవలం తలైవర్ కే సాధ్యం’’ అని వారు ట్వీట్ చేశారు.