Hyderabad: హైదరాబాద్‌లో యువకుడి డ్రామా.. సోదరి భర్తను స్నేహితులతో కొట్టించి దొరికిపోయిన వైనం!
- తన భర్త వేధిస్తున్నాడని చెప్పిన సోదరి
- బావకు బుద్ధి చెప్పాలనుకున్న యువకుడు
- ఇటీవల బావపై దాడి
- అనుమానం రాకుండా తాను కూడా దెబ్బలు తిన్న వైనం
హైదరాబాద్‌లో ఓ యువకుడు ఆడిన డ్రామా బయటపడింది. తన సోదరిని వేధిస్తున్నాడని బావను స్నేహితులతో కొట్టించాడు. ఆ సమయంలో ఆయనతో ఉండి, తనపై అనుమానం రాకుండా స్నేహితుల చేతిలో తానూ దెబ్బలు తిన్నాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమను ఎవరో దుండగులు కొట్టారంటూ ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఆరా తీసిన చిలకలగూడ పోలీసులు అసలు విషయాన్ని గుర్తించారు.
హైదరాబాద్‌లోని రామాంతపూర్‌కు చెందిన శ్రీనివాస్‌కు వరుసకు చెల్లి అయ్యే ఓ యువతిని అంబర్‌పేట్‌కు చెందిన నరేష్కుమార్ పెళ్లి చేసుకున్నాడు. అయితే, నరేష్కుమార్ తనను వేధిస్తున్నాడని ఆమె శ్రీనివాస్‌కు చెప్పింది. దీంతో తన స్నేహితులకు చెప్పి నరేష్‌కుమార్‌పై ఆయన దాడి చేయించాలనుకున్నాడు.
ఇటీవల తన బావ నరేష్‌కుమార్‌తో కలసి ఓ ఫంక్షన్ కు వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా వారిని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామై ఉస్మానియా వద్ద ముగ్గురు (శ్రీనివాస్ స్నేహితులు) అడ్డగించి, చితక్కొట్టారు. దీంతో నరేష్‌కుమార్‌కు తీవ్రగాయాలు కాగా, కావాలని కొట్టించుకున్న శ్రీనివాస్‌కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.