pulicat lake: పులికాట్ సరస్సులో తప్పిన పెను ప్రమాదం.. 30 మంది సేఫ్!
- ఇరకం దీవిలో పొన్నియమ్మ రథోత్సవం
- భారీగా వస్తున్న భక్తులు
- భక్తులను తరలించేందుకు పడవలను నడుపుతున్న మత్స్యకారులు
ఏపీలో వరుసగా పడవ ప్రమాదాలు సంభవిస్తూ, ప్రాణాలను బలిగొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా పులికాట్ సరస్సులో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే, ఇరకం దీవిలో జరుగుతోన్న పొన్నియమ్మ రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇరకం-భీములవారిపాలెం మధ్య భక్తులను తరలించేందుకు మత్స్యకారులు పడవలను నడుపుతున్నారు.
ఈ క్రమంలో భీములపాలెం రేవుకు 30 మంది భక్తులతో తిరిగి వస్తున్న ఓ పడవ ప్రమాదానికి గురైంది. చిన్న పడవలోకి భారీ సంఖ్యలో భక్తులు ఎక్కడంతో పడవలోకి నీరు చేరడం ప్రారంభమైంది. రేవు సమీపంలోకి వచ్చేసరికి పడవ ఒక్కసారిగా మునిగిపోయింది. అయితే, అప్పటికే ఒడ్డుకు సమీపంలోకి వచ్చేయడంతో, కింద ఉన్న నేలకు పడవ ఆనుకుంది. దీన్ని గమనించి ఇతర పడవల నిర్వాహకులు వెంటనే ప్రమాద స్థలికి వెళ్లి, అందరినీ ఒడ్డుకు తరలించారు. ఇదే ప్రమాదం సరస్సు మధ్యలో జరిగి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేది. జరిగిన ఘటనతో భక్తులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.