varanasi: కాశీ ఆలయాన్ని పేల్చివేస్తామంటూ ‘లష్కరే’ హెచ్చరిక..యూపీ సర్కార్ అప్రమత్తం!
- పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా బెదరింపు లేఖ
- యూపీలోని కృష్ణ జన్మభూమి, కాశీ ఆలయాలతో పాటు రెండు రైల్వేస్టేషన్లకు బెదిరింపు
- అప్రమత్తమైన యూపీ పోలీసులు
యూపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను పేల్చివేస్తామంటూ పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరించింది. ఈ మేరకు బెదిరింపు లేఖ రాసింది. మే 29న ఈ లేఖ రైల్వే శాఖకు అందినట్టు సమాచారం. యూపీలోని కృష్ణ జన్మభూమి (మధుర), వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయాలతో హపూర్, సహరాన్ పూర్ రైల్వేస్టేషన్లను కూడా పేల్చివేస్తామని బెదిరించారు. ఈ నెల 6, 8, 10 తేదీల్లో ఆయా స్థలాల్లో పేలుళ్లకు పాల్పడతామని ఈ లేఖలో బెదిరించారు.
ఈ నేపథ్యంలో యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. బంకీ బిహారీ ఆలయం, మధుర జంక్షన్, మధుర రిఫైనరీ సహా పలు కీలక ప్రాంతాల్లో పోలీసులు, కమెండోలను మోహరించారు. ఈ సందర్భంగా అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, ఈ లేఖను చూసి భయపడాల్సిన పని లేదని బహుశ ఆకతాయిల పని అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
ఈ బెదిరింపు లేఖపై మౌలానా అంబూ షేక్, ఏరియా కమాండర్, ఎల్ ఈటీ జమ్మూ అండ్ కాశ్మీర్ అని సంతకం చేసి ఉందని చెప్పారు. ప్రజలు, పర్యాటకులు పర్యటించే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, గస్తీ వాహనాల సంఖ్యను పెంచామని చెప్పారు.