YSRCP: మా రాజీనామాలు ఆమోదం పొందినట్టే.. ఇక ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు చెబుతాం: ఎంపీ మేకపాటి

  • హోదా సాధించే వరకు పోరాటం ఆగదన్న వైవీ సుబ్బారెడ్డి
  • విలువలను అమ్ముకోలేదన్న అవినాష్
  • చిత్తశుద్ధితో రాజీనామాలు చేశామన్న మిథున్

లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ తో వైసీపీ ఎంపీల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా రాజీనామాలకు కట్టుబడే ఉన్నామని ఎంపీలు తెలిపారు. ఇదే విషయంపై ధ్రువీకరణ లేఖ పంపిన వెంటనే రాజీనామాలను ఆమోదిస్తామని స్పీకర్ చెప్పారు. భేటీ అనంతరం వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు.

ఇక తమ రాజీనామాలు ఆమోదం పొందినట్టేనని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. పార్టీ మారిన ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ ను కోరామని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఇద్దరు ఎంపీలపై ఫిర్యాదులు అందినట్టు స్పీకర్ చెప్పారని తెలిపారు. ప్రత్యేక హోదాను సాధించే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.

ప్రజలను తాము నమ్ముకున్నామని, విలువలను అమ్ముకోలేదని వైయస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలు తమకు కొత్త కాదని చెప్పారు. రాజీనామాలపై టీడీపీ నేతల సర్టిఫికెట్ తమకు అవసరం లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని మరో ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. మిథున్ రెడ్డి మాట్లాడుతూ, హోదా కోసం చిత్తశుద్ధితో తాము రాజీనామాలు చేశామని చెప్పారు. ప్రజాక్షేత్రంలో టీడీపీ నాటకాలను ఎండగడతామని హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News