indian railway: అధిక లగేజీతో రైలెక్కితే భారీగా జరిమానాలు!
- స్లీపర్ కోచ్ లో 40 కిలోల బరువుకు చార్జీ లేదు
- సెకండ్ క్లాస్ కోచ్ లో 35 కిలోల వరకే
- ఇది దాటితే అదనంగా చార్జీ చెల్లించాలి
విమానాల్లో ప్రయాణించేవారికి లగేజీ పరంగా చాలా పరిమితులున్నాయి. నిర్ణీత బరువు దాటితే భారీ చార్జీలు భరించాలి. త్వరలో రైళ్లలోనూ ఇవి అమలు కానున్నాయి. రైళ్లలోనూ ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే లగేజీ విషయంలో ఇప్పటికే పరిమితులున్నాయి. కానీ, వాటి అమలును పట్టించుకోవడం లేదు. ఇకపై వీటిని కఠినంగా అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అధిక లగేజీతో రైలెక్కే వారి నుంచి నిర్దేశిత మొత్తానికి ఆరు రెట్ల మేర పెనాల్టీ వసూలు చేయనున్నారు.
నిబంధనల మేరకు స్లీపర్ కోచ్ లో 40 కేజీలు, సెకండ్ క్లాస్ ప్రయాణికులు ఒక్కొకరు తమతోపాటు 35 కిలోల లగేజీని తీసుకెళ్లొచ్చు. ఇందుకు ఏ మాత్రం చార్జీలు చెల్లించక్కర్లేదు. ఇది దాటితే 80, 70 కిలోల బరువు వరకు పార్సిల్ కార్యాలయంలో అదనపు చార్జీ చెల్లించి అనుమతి పొందాలి. లగేజీ సైజు 100 సెంటీమీటర్ల పొడవు, 60 సెంటీమీటర్ల వెడల్పు, 25 సెంటీమీటర్ల ఎత్తు పరిమాణం దాటరాదు. ఇప్పటికే ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయని, కాకపోతే వాటిని ఇప్పుడు కఠినంగా అమలు చేయనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికుల సౌకర్యం కోసం, కంపార్ట్ మెంట్లు బాగా నిండిపోకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకుంటున్నట్టు వివరించింది.
500 కిలోమీటర్ల దూరానికి 80 కిలోల బరువున్న లగేజీని తీసుకెళ్లాలంటే స్లీపర్ కోచ్ లో అదనంగా ఉన్న 40 కిలోల బరువుకు గాను పార్సిల్ కార్యాలయంలో రూ.109 చెల్లించాలి. ఒకవేళ చార్జీ చెల్లించకుండా ఇంత బరువున్న లగేజీ తీసుకెళుతూ పట్టుబడితే జరిమానా కింద రూ.654 కట్టాల్సి వస్తుంది.