YSRCP: లోక్ సభ స్పీకర్ తో భేటీ అయిన వైసీపీ ఎంపీలు
- రాజీనామాలను ఆమోదించాలని కోరిన ఎంపీలు
- కొనసాగుతున్న సమావేశం
- రాజీనామాలను ఆమోదించే అవకాశం
తమ పదవులకు రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు కాసేపటి క్రితం లోక్ సభ స్పీకర్ సుమిత్రామహాజన్ కార్యాలయానికి చేరుకుని, ఆమెతో భేటీ అయ్యారు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని మరోసారి ఆమెను కోరారు. స్పీకర్ ను కలిసిన వారిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్ ఉన్నారు. వీరి రాజీనామాలపై స్పీకర్ ఈరోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గత పార్లమెంటు సమావేశాల చివరి రోజు అయిన ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలను సమర్పించారు. అయితే రాజీనామాలను సుమిత్ర పెండింగ్ లో పెట్టారు. మే 29న స్పీకర్ ను కలిసిన ఎంపీలు తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు. అయితే, ప్రత్యేక హోదాకు సంబంధించిన భావోద్వేగాలతోనే రాజీనామా చేస్తున్నట్టు తాను భావిస్తున్నానని... మరోసారి ఆలోచించుకోవాలని ఎంపీలకు సుమిత్ర చెప్పి పంపించారు. ఇప్పుడు తమ రాజీనామాలను ఆమోదించాలని ఎంపీలు పట్టుబడితే... స్పీకర్ రాజీనామాలను ఆమోదించే అవకాశమే ఎక్కువగా ఉందని తెలుస్తోంది.