Hyderabad: నింపాదిగా పది అంతస్తులూ ఎక్కి... కేకలు పెడుతున్నా వినకుండా దూకేసింది!: సీసీటీవీల్లో విద్యార్థిని ఆత్మహత్య దృశ్యాలు
- నిన్న హైదరాబాద్ లోని అబీడ్స్ లో ఆత్మహత్య
- అనుకున్న ర్యాంక్ రాలేదని తీవ్ర మనస్తాపం
- జిమ్ కు వెళుతున్నానని చెప్పి సూసైడ్
తనకు నీట్ లో అనుకున్న ర్యాంకు రాలేదని, నిన్న హైదరాబాద్ లోని అబీడ్స్ లో ఉన్న బహుళ అంతస్తుల భవంతి మయూర్ కుషాల్ కాంప్లెక్స్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న జస్లిన్ కౌర్ వీడియోలను పోలీసులు విడుదల చేశారు. కాచిగూడ ప్రాంతంలో నివాసం ఉంటున్న బట్టల వ్యాపారి రణవీర్ సింగ్, లవ్లీన్ కౌర్ ల కుమార్తె జస్లిన్ కు లక్ష వరకూ ర్యాంకు వచ్చింది. అనుకున్న ర్యాంకు రాలేదన్న బాధలో ఉన్న ఆమెను తల్లిదండ్రులు ఓదార్చగా, అప్పటికి కుదుటపడ్డ ఆమె, ఆ తర్వాత తీవ్ర మనస్తాపం చెంది, మంగళవారం ఉదయం జిమ్ కు వెళుతున్నట్టు చెప్పి బయటకు వెళ్లి, ఆత్మహత్యకు పాల్పడింది.
ఇక మయూర్ కుషాల్ లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తే, ఆమె ఎంతో నింపాదిగా మెట్లు ఎక్కుతూ కనిపించింది. పది అంతస్తులనూ ఆమె నడుస్తూనే ఎక్కింది. సరిగ్గా 10.21 గంటల ప్రాంతంలో భవంతి పైకి చేరుకుంది. ఆమెను గమనించిన పలువురు స్థానికులు దూకవద్దని కేకలు పెట్టారు. ఆపై నాలుగు నిమిషాలకు జస్లిన్ కిందకు దూకింది. వెంటనే అక్కడికి వచ్చిన 108 సిబ్బంది, ఆమె మృతిచెందినట్టు చెప్పారు. తమ కుమార్తె ఎంతసేపయినా ఇంటికి రాలేదని, కాచిగూడ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన జస్లిన్ తల్లిదండ్రులు, అక్కడే టీవీల్లో 'అబీడ్స్ లో యువతి ఆత్మహత్య' వార్తను చూసి కుప్పకూలారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని, కేసు దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.