assom: వయసు నాలుగేళ్లు... పుస్తకం రాసి బుల్లి రచయిత అయ్యాడు!
- భారత అతి చిన్న వయస్కుడయిన రచయితగా రికార్డు
- అసోంలోని తాతయ్య దగ్గర ఉంటోన్న బాలుడు
- 30 కథలను, మరెన్నో విషయాలను రాసిన వైనం
సాధారణంగా నాలుగేళ్ల పిల్లలు ఇంట్లో ఆడుకుంటూ, అల్లరి చేస్తూ కనపడుతుంటారు. కానీ, అసోంలోని ఈ నాలుగేళ్ల బాలుడు అందరికీ భిన్నం. నాలుగేళ్ల వయసులోనే పుస్తకం రాసి, భారత అతి చిన్న వయస్కుడయిన రచయితగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కెక్కి అదరహో అనిపించాడు. ఆ రాష్ట్రంలోని నార్త్ లఖింపూర్ జిల్లాకు చెందిన అయాన్ గగోయ్ గోహెయిన్.. సెయింట్ మేరీస్ స్కూల్‌లో చదువుతున్నాడు. అతడి తల్లిదండ్రులు మిజోరాంలో ఉంటారు.
ఈ బుడతడు తాతయ్య ఇంట్లో ఉంటూ స్కూలుకెళుతున్నాడు. 30 కథలు, పలు ఊహాజనిత విషయాలతో పాటు, అందమైన పలు బొమ్మలను కూడా గీసి ఆ సంకలనంతో ‘హనీకోంబ్’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చాడు. ఏడాది వయసు నుంచే పెయింటింగ్స్ వేయడం ప్రారంభించిన అయాన్.. మూడేళ్ల వయసులో స్వయంగా కథలు చెప్పడం మొదలెట్టేశాడు. ప్రతి రోజూ తన చుట్టూ జరుగుతున్న సంఘటనలను గమనించి వాటినే పుస్తకంలో రాశాడు. రోజులో నేర్చుకున్న కొత్త విషయాలను కూడా అందులో పొందుపర్చాడు. తనకు తన తాతయ్య పుర్నో కంటా గగోయ్ మంచి స్నేహితుడని, రోల్ మోడలని సదరు బుల్లి రచయిత చెప్పాడు.