Hyderabad: ‘అవుటర్’ చుట్టూ సాధ్యమైనన్ని ఎక్కువ సౌకర్యాలు కల్పించాలి: మంత్రి కేటీఆర్
- హెచ్ఎండీఏ ప్రాజెక్టులు, కార్యకలాపాలపై సమీక్ష
- అవుటర్ పై ప్రతి పది కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ ఉండాలి
- ఆరోగ్య శాఖ సమన్వయంతో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి
అవుటర్ రింగ్ రోడ్డు నగరానికి మణిహారం లాంటిదని, దీని చుట్టూ సాధ్యమైనన్ని ఎక్కువ సౌకర్యాలను కల్పించాలని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. హెచ్ఎండీఏ ప్రాజెక్టులు, కార్యకలాపాలపై ఈరోజు సమీక్షించారు. హైదరాబాద్ లోని బేగంపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ కమీషనర్ చిరంజీవులు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ భారతి హోళికేరీ తదితరులు పాల్గొన్నారు. సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, ప్రాజెక్టుల వారీగా వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ముఖ్యంగా ఇంటర్ చేంజ్ ల వద్ద వే సైడ్ అమెనిటీస్ ఏర్పాటు చేయాలని, అవుటర్ పై ప్రతి పది కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ ఉండేలా వాటి సంఖ్యను పెంచాలని, ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవుటర్ రింగ్ రోడ్డుపై పూర్తి స్థాయిలో ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేసే ప్రక్రియ గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాలని, జన సమ్మర్ధంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి రేడియల్ రోడ్లు, గ్రిడ్ రోడ్ల అభివృద్ది మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.ఇప్పటికే ఇందుకోసం సంస్థ పలు ఇంటర్ చేంజ్ లను పరిశీలించిందని, అవుటర్ చుట్టూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున గ్రీనరీ పెంచుతున్నామని, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉప్పల్ ప్రాంతంలో చేపడుతున్న శిల్పారామం పనులు దసరా నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
కాగా, సంస్థ చేపట్టిన బాట సింగారం, మంగల్ పల్లి మెదలైన లాజిస్టిక్స్ పార్కుల పురోగతిని మంత్రి సమీక్షించారు. సంస్థ పరిధిలో చేపట్టిన చెరువుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా త్వరలోనే 40 చెరువుల్లో పనుల కోసం టెండర్లు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ప్రాజెక్ట్ కు ఒక టైం లైన్ పెట్టుకుని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాలానగర్ లో నిర్మాణం జరుగుతున్న ఫ్లైఓవర్ పురోగతిపై ప్రత్యేకంగా సమీక్షించారు. నగరంలో నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలను జీహెచ్ఎంసీతో కలిసి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
హెచ్ఎండీఏ పనితీరు, ప్రాజెక్టుల అమలుపైన మంత్రి అభినందనలు తెలిపారు. విధుల్లో మంచి నైపుణ్యం ప్రదర్శించిన ఉద్యోగులను గుర్తించి వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కమిషనర్ ను మంత్రి ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో సంస్థ అధికారులు మరింత ఎక్కువగా భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. ప్రజల సౌకర్యార్ధం టౌన్ ప్లానింగ్, ఇతర అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, ప్రస్తుతం ఉన్న అనుమతుల ప్రక్రియ ప్రభావవంతంగా పనిచేస్తున్నదని, అయితే హెచ్ఎండీఏ అనుమతులు ఉన్న లే-అవుట్లలో ఇళ్ల నిర్మాణానికి సత్వరం అనుమతులు వచ్చేలా కొన్ని మార్పులను సూచించారు. నగరానికి నలువైపులా బస్ టెర్మినల్స్ నిర్మాణానికి భూములను గుర్తించాలని, వారం రోజుల్లోగా ఓ నివేదిక తనకు అందజేయాలని ఆదేశించారు.