Nara Lokesh: ఇప్పుడు రాత్రుళ్లు హాయిగా సీరియళ్లు చూస్తున్నారు.. అవునా? కాదా?: నారా లోకేశ్
- కరెంటు పోతుందేమోనన్న టెన్షన్ ఇప్పుడు లేదు
- నిరుద్యోగులకు రూ.1000 చొప్పున భృతి
- జగన్, పవన్ కుట్రలను ప్రజలే తిప్పికొడతారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనలో కరెంటు కష్టాలు లేవని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పొలాల పనులన్నీ అయిపోయిన తరువాత ఇంట్లో హాయిగా ఫ్యాను కింద రైతులు సేద తీరుతున్నారని అన్నారు. 'ఇప్పుడు హాయిగా రాత్రుళ్లు సీరియళ్లు చూస్తున్నారు.. అవునా? కాదా? ఇప్పుడు టెన్షన్ లేదు ఎక్కడ కరెంటు పోతుందోనని..' అని అన్నారు.
ఈరోజు గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన లోకేశ్ అనంతరం మాట్లాడుతూ.. రాబోయే 30 రోజుల్లో నిరుద్యోగులకు రూ.1000 చొప్పున భృతి ఇస్తున్నామని అన్నారు. అంతేగాక చంద్రన్న బీమా వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామని, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని అన్నారు. కాగా, వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్‌ల కుట్రలను ప్రజలే తిప్పి కొడతారని లోకేశ్ అన్నారు. శత్రువులంతా ఏకమై టీడీపీపై కుట్రలు పన్నుతున్నారని అన్నారు.