ramana deekshitulu: సీబీఐ విచారణకు నేను సిద్ధం.. రెండు సార్లు నాపై హత్యాయత్నం జరిగింది: రమణ దీక్షితులు
- వీఐపీలు వచ్చినప్పుడు డాలర్ శేషాద్రినే ప్రధాన అర్చకుడిగా పరిచయం చేసేవారు
- నిధుల కోసమే అన్నపోటు వద్ద తవ్వకాలు జరిపారు
- అక్రమాలను బయటపెడుతున్నందుకే నన్ను రిటైర్ చేశారు
తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సీబీఐ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని... ఆరోపణలు చేసిన వారు కూడా సిద్ధమేనా? అంటూ టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సవాల్ విసిరారు. గతంలో టీడీపీ జేఈవోలుగా పని చేసిన ధర్మారెడ్డి, శ్రీనివాసరాజు, బాలసుబ్రహ్మణ్యంలు ఏలినాటి శనిలాంటి వారని విమర్శించారు.
బాలసుబ్రహ్మణ్యం హయాంలోనే వేయికాళ్ల మండపాన్ని కూల్చేశారని, దీని వెనుక ఆయనకు లాభార్జన ఉందని ఆరోపించారు. ఎవరైనా వీఐపీలు వచ్చినప్పుడు డాలర్ శేషాద్రినే ప్రధాన అర్చకుడిగా చెప్పేవారని, తనను కనీసం ఓ అర్చకుడిగా కూడా పరిచయం చేసేవారు కాదని మండిపడ్డారు. వంశపారంపర్యంగా ఉన్న తన ఇంటిని కూడా కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ధర్మారెడ్డి కాలంలో తనపై రెండు సార్లు హత్యాయత్నం జరిగిందని రమణ దీక్షితులు తెలిపారు. స్వామివారి అమూల్యమైన సంపద అన్నపోటు వద్ద ఉందని బ్రిటీష్ శాసనంలో ఉందని... నిధుల కోసం అక్కడ తవ్వకాలు జరిపారని ఆరోపించారు. టీటీడీలోని అక్రమాలను బయటపెట్టినందుకే, తనను ముందుగానే రిటైర్ చేశారని చెప్పారు. టీటీడీలోని నిరంకుశత్వాన్ని, బ్రాహ్మణుల పట్ల ద్వేషాన్ని ప్రశ్నించకూడదా? అని అడిగారు.