Tirupati: మూడు తరాల దొంగలు... తల్లీకూతుళ్లతో కలసి దొరికిపోయిన మహిళ!
- తెలుగు రాష్ట్రాల్లో 100కు పైగా కేసులు
- తిరుచానూరులో పట్టుబడ్డ అంతర్రాష్ట్ర దొంగల ముఠా
- రిమాండ్ కు తరలించిన పోలీసులు
తన తల్లీకూతుళ్లతో కలసి దొంగతనాలు చేస్తూ, తెలుగు రాష్ట్రాల్లో 100కు పైగా కేసులలో నిందితులుగా వున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా తిరుపతి పరిధిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద పోలీసులకు పట్టుబడింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, నిర్మల అలియాస్ సయ్యద్ రషీద్ బేగం (58), లక్ష్మీ అలియాస్ మీరున్నీసా (35), సోనీ అలియాస్ రిజ్వానా (19) హైదరాబాద్ లోని అంబర్ పేటలో నివాసం వుంటున్నారు.
ఎక్కడ రద్దీ ఎక్కువగా ఉన్నా, ఏ ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నా వీరు అక్కడ వాలిపోతారు. షేర్ ఆటోల్లో ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని ఆభరణాలు కొట్టేస్తారు. దొంగతనం చేయాలనుకునే ప్రాంతానికి ఖరీదైన దుస్తులతో వెళ్లే వీళ్లు, స్టార్ హోటళ్లలో బస చేసి, తమ పని కానిచ్చేస్తారు. ఈ క్రమంలో తిరుపతిలో రద్దీ అధికంగా ఉందని తెలుసుకున్న ఈ అవ్వ, అమ్మ, మనవరాలు... రెండు రోజుల క్రితం పట్టణానికి వచ్చారు.
పద్మావతి అమ్మవారి మెట్లపై కూర్చుని ఉండగా, అక్కడ గస్తీలో ఉన్న సీఐ పద్మలత బృందానికి వీరి వైఖరిపై అనుమానం వచ్చింది. విచారించడంతో వీరి బండారం బట్టబయలైంది. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని, వీరి నుంచి రూ. 6.42 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కాగా, సోనీ బాల నేరస్తురాలిగా కాచిగూడ బాలికల జువైనల్ హోమ్ లో 6 నెలల శిక్షను అనుభవించింది కూడా.