Chandrababu: అమరావతిలో సీఎం ఇంటి కింద తవ్వినా ఏదో ఒక ఖనిజం ఉంటుంది: అరకులో పవన్‌ కల్యాణ్‌

  • మ‌న సంప్ర‌దాయాల‌కు గౌరవమిచ్చే అభివృద్ధి ఉండాలి
  • మ‌న ఉనికిని ప్రశ్నార్థకం చేసే అభివృద్ధి అవ‌స‌రం లేదు
  • గిరిజ‌నుల‌ను రెచ్చ‌గొట్ట‌డానికి రాలేదు
  • భ‌య‌పెట్టి, బ‌ల‌హీనులుగా చేసే వారిపై పోరాడతా

మ‌న ఆట‌, పాట‌, సంప్ర‌దాయాల‌కు గౌరవమిచ్చే అభివృద్ధి ఉండాలి కానీ, మ‌న ఉనికిని ప్రశ్నార్థకం చేసే అభివృద్ధి అవ‌స‌రం లేద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ప్రకృతికి దగ్గరగా జీవించేవారి మనసు, ఆలోచనల్లో స్వచ్ఛత ఉంటుందని, వారి జీవనంలో అవినీతికి తావు ఉండదని చెప్పారు. ప్రకృతి, అడవులు ఇంకా మనకి మిగిలి ఉన్నాయంటే అందుకు కారణం గిరిజనులే అని అన్నారు.

ఈరోజు విశాఖపట్నం సమీపంలోని అరకులో పవన్.. గిరిజనులతో సమావేశమయ్యారు. ఆరుబయట ప్రకృతిలో వారితో మాట్లాడుతుండగా వర్షం మొదలైంది. దీంతో ఆ సమావేశాన్ని రిసార్ట్ లో కొనసాగించారు. గిరిజ‌నుల స‌మ‌స్య‌లు, అత్య‌వ‌స‌రంగా క‌ల్పించాల్సిన సౌక‌ర్యాల‌పై ఆరా తీశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. “ప్ర‌కృతికి ద‌గ్గ‌ర‌గా బతికేవాళ్ల దగ్గర అవినీతి ఉండదు. దానిని దాటి ఏదో సంపాదించుకోవాల‌న్న అత్యాశతోనే అవినీతికి బీజం పడుతుంది. అభివృద్ధికి మైనింగ్ అవ‌స‌ర‌మే. అయితే అది ఎక్క‌డ త‌వ్వాలి? ఎంతమేరకు? అనేది నిబంధనలకి అనుగుణంగా ఉండాలి. అమ‌రావ‌తిలో ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఇంటికింద త‌వ్వినా ఏదో ఒక ఖ‌నిజం దొరుకుతుంది.

ఇక్క‌డికి గిరిజ‌నుల‌ను రెచ్చ‌గొట్ట‌డానికో, మ‌భ్య‌పెట్ట‌డానికో, రాజకీయ అవసరాలకో నేను రాలేదు. గిరిజ‌నుల‌ను భ‌య‌పెట్టి, బ‌ల‌హీనులుగా చేసే వారిపై పోరాడ‌టానికి వచ్చాను. ఈ విషయంలో మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాను. మీ నుంచి ఏమీ ఆశించను. బాక్సైట్ మైనింగ్ విషయంలో ఎప్పుడూ గిరిజనులకే అండగా ఉంటాను. బాక్సైట్ త‌వ్వ‌కాల‌పై గ్రామ స‌భ‌లు పెట్టి, 70 శాతం ప్ర‌జ‌ల ఆమోదంతోనే త‌వ్వ‌కాలు జరపాలి.

ప్ర‌కృతిలో మ‌మేకమై జీవించే గిరిజనుల్ని దాని నుంచి దూరం చేస్తే అశాంతికి దారి తీస్తుంది. కొద్దిమంది ఏసీ గ‌దుల్లో కూర్చొని గిరిజన పాల‌సీలు రాస్తున్నారు. వారు గిరిజన గూడేలు తిరిగి పాల‌సీ రాస్తే అది ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌త్స్య‌కారుల‌ను ఎస్టీల్లో చేరుస్తామ‌ని టీడీపీ తన మేనిఫెస్టోలో పెట్టింది. దానిని నేను ప్ర‌శ్నిస్తే నాపై గిరిజనుల్ని రెచ్చగొట్టారు. నాలుగు ద‌శాబ్దాల చంద్ర‌బాబు అనుభ‌వం ఇలా కులాల మ‌ధ్య కుమ్ములాట‌లు పెట్ట‌డానికి పనికొచ్చింది” అని అన్నారు.

  • Loading...

More Telugu News