amit shah: బాబా, మీ మద్దతు కావాలి!: బాబా రాందేవ్ ను కలసిన అమిత్ షా

- కాంటాక్ట్ ఫర్ సపోర్ట్ క్యాంపెయిన్ ను చేపట్టిన బీజేపీ
- బాబా రాందేవ్, కపిల్ దేవ్ లను కలిసిన అమిత్ షా
- గతంలో బీజేపీకి మద్దతు ఇచ్చిన వారికి రిపోర్టు కార్డును అందిస్తున్న వైనం
యోగా గురు బాబా రాందేవ్ ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిసి ఆయన మద్దతును కోరారు. 2019 సాధారణ ఎన్నికల్లో భాగంగా చేపడుతున్న 'సంపర్క్ ఫర్ సమర్థన్' ప్రచారానికి మద్దతు ఇవ్వాల్సిందిగా విన్నవించారు. అనంతరం అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ, రాందేవ్ బాబా మద్దతు కోసం తాను వచ్చానని తెలిపారు. తాను చెప్పిన విషయాలన్నింటినీ బాబా చాలా ఓపికగా విన్నారని చెప్పారు. తాము చేస్తున్న పనులన్నింటినీ బాబాకు వివరించానని తెలిపారు. తమకు రాందేవ్ బాబా మద్దతు పలికితే, ఆయనకు ఉన్న కోట్లాది మంది ఫాలోయర్లకు తాము దగ్గరవుతామని చెప్పారు.
తాము చేపట్టిన 'సంపర్క్ ఫర్ సమర్థన్' లేదా 'కాంటాక్ట్ ఫర్ సపోర్ట్' క్యాంపెయిన్ లో భాగంగా తాను మరి కొంత మంది నేతలు 50 మంది ప్రముఖులను కలిసేలా కార్యాచరణ రూపొందించామని అమిత్ షా చెప్పారు. ఇందులో భాగంగా గతంలో బీజేపీకి మద్దతు ప్రకటించిన ఈ ప్రముఖులకు తమ రిపోర్ట్ కార్డును ఇస్తామని తెలిపారు. 2014లో తమతో ఉన్నవారి ఆశీస్సులను తీసుకుంటామని చెప్పారు.


