TRS: టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ... కోమటిరెడ్డి, సంపత్ లపై వేసిన పిటిషన్ కొట్టివేత!

  • ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేసిన అసెంబ్లీ
  • చెల్లదని తీర్పిచ్చిన సింగిల్ జడ్జ్
  • సవాల్ చేసిన 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ 

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ల శాసన సభ్యత్వాల రద్దు చెల్లదంటూ హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుపై 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొద్దిసేపటి క్రితం కొట్టేసింది. ఇటీవలే విచారణ ముగించిన హైకోర్టు తన తీర్పును రిజర్వ్ లో ఉంచిన సంగతి తెలిసిందే.

ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో, కోమటిరెడ్డి హెడ్‌ ఫోన్ విసరగా, అది మండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ కు తగిలిన సంగతి తెలిసిందే. ఆపై కోమటిరెడ్డి, సంపత్‌ కుమార్‌ ల సభ్యత్వాలను అసెంబ్లీ రద్దు చేయగా, వారు దాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. తాము కోర్టును ఆశ్రయించిన తరువాత మాత్రమే, అసెంబ్లీ నుంచి తమను బహిష్కరించినట్టుగా గవర్నర్ సంతకం చేయించి, దాన్ని అసెంబ్లీ వెబ్‌ సైట్ లో పెట్టారని కాంగ్రెస్ నేతల తరుపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కోర్టుకు తెలిపారు.

వీడియో ఫుటేజ్ ని టీఆర్ఎస్ ప్రభుత్వం బయట పెట్టలేదని, కనీసం కోర్టుకు కూడా ఇవ్వలేదని గుర్తు చేసిన ఆయన, గవర్నర్ అసెంబ్లీలో ఉండగా, సభ మొత్తం ఆయన పరిధిలోనే ఉంటుందని, సస్పెన్షన్ పై ఆయన మాత్రమే నిర్ణయం తీసుకోగలరని వాదించారు. ఆయన వాదనతో ఏకీభవిస్తున్నట్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. వారి సభ్యత్వాల రద్దును కొనసాగించాలని, సింగిల్ జడ్జ్ తీర్పును పరిగణనలోకి తీసుకోవద్దని వేసిన పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News