Malls: సినిమా హాల్స్ లో రూపాయి ఎక్కువ తీసుకున్నా వెంటనే 7330774444 నంబరుకు ఫోన్ చేయండి!: అకున్ సబర్వాల్
- సినీ ప్రేక్షకులను అడ్డంగా దోచేస్తున్న మాల్స్, మల్టీప్లెక్స్ లు
- ఏకకాలంలో దాడులు జరిపిన తూనికలు, కొలతల శాఖ
- తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్
హైదరాబాద్ లోని మాల్స్, మల్టీ ప్లెక్స్ లు, సినిమా హాల్స్ లో తినుబండారాలు, కూల్ డ్రింక్స్ తదితరాలపై ప్రేక్షకులను భారీగా దోచుకుంటున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో గత రెండు రోజులుగా వివిధ మాల్స్ పై దాడులు జరిపి 100కు పైగా కేసులను నమోదు చేసిన లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులు, ఇకపై ఎంఆర్పీకి మించి ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కేసుల వివరాలను వెల్లడించిన తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్, 15 బృందాలు వివిధ మాల్స్ లో తనిఖీలు చేశాయని తెలిపారు.
జంట నగరాల పరిధిలోని జీవికే వన్, ప్రసాద్ ఐమాక్స్, పీవీఆర్ - పంజాగుట్ట, పీవీఆర్ - ఇనార్బిట్ మాల్, పీవీఆర్ - ఫోరమ్ సుజనా మాల్, సినీ పోలిస్, సినీ పోలీస్ - సీసీపీఎల్, కార్నివాల్ - అమీర్పేట్, పీవీఆర్ ఐకాన్ - హైటెక్ సిటీ, మిరాజ్ - దిల్సుఖ్నగర్, లియోనియా కార్నివాల్, ఏషియన్ సినిమాస్ (రాధికా మల్టిప్లెక్స్), మహేశ్వరి మాల్, పీవీఆర్ నెక్ట్స్ గలేరియా మాల్ - పంజాగుట్ట, ఏషియన్ జీపీఆర్ - కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరిపామని, వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్న దుకాణదారులపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఇకపై మల్టీ ప్లెక్స్ లు, సినిమా థియేటర్లలో మోసం జరిగినట్టు గమనిస్తే, 7330774444 నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అకున్ సభర్వాల్ కోరారు. తాము వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.