Congress: మధ్యప్రదేశ్ లో జనాభా 24 శాతం పెరిగితే, ఓటర్లు 40 శాతం పెరిగారట.. కాంగ్రెస్ ఆరోపణ!
- రాష్ట్రంలో 60 లక్షల మంది నకిలీ ఓటర్లు
- సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
- 3.86 లక్షల మంది పేర్లను తొలగించిన ఎన్నికల సంఘం
త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న మధ్యప్రదేశ్‌లో ఓటర్ల లిస్టు అమాంతం పెరిగిపోయింది. ఏకంగా 60 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నట్టు గుర్తించిన కాంగ్రెస్ సాక్ష్యాలతో సహా వాటిని ఎన్నికల సంఘానికి అందజేసి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఎలక్షన్ కమిషన్ నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. సోమవారం నుంచి ఈ బృందాలు డోర్ టు డోర్ వెరిఫికేషన్ ప్రారంభించనున్నాయి. నాలుగు రోజుల్లో ఇందుకు సంబంధించిన నివేదికను సమర్పించనున్నాయి.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో 60 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నట్టు గుర్తించినట్టు చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగిందని, ఇది ముమ్మాటికి పాలనా దుర్వినియోగం కిందకు వస్తుందని అన్నారు. పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. పదేళ్లలో రాష్ట్ర జనాభా 24 శాతం పెరిగితే ఓటర్లు మాత్రం 40 శాతం ఎలా పెరిగారో అర్థం కావడం లేదన్నారు. ఒక్కో ఓటరు పేరు 26 జాబితాల్లో రిజిస్టర్ అయినట్టు ఉందని తమ పరిశీలనలో తేలిందన్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు.
60 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారన్న కాంగ్రెస్ ఆరోపణలను రాష్ట్ర ఎన్నికల అధికారి సలీనా సింగ్ ఖండించారు. అటువంటిదేమీ లేదని పేర్కొన్నారు. అటువంటి ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే 3.86 లక్షల మంది పేర్లను డిలీట్ చేసినట్టు వివరించారు.