RLD LEADER: బీజేపీకి చెక్ పెట్టేందుకు ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ మద్దతివ్వాలి: ఆర్ఎల్డీ నేత
- యూపీలో సీట్ల పంపిణీ అన్నది చాలా క్లిష్టం
- నాలుగు పెద్ద ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి
- అయినా బీజేపీని అడ్డుకునేందుకు కలసి సాగాలి
ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట 2019 లోక్ సభ ఎన్నికల్లో వాటితో కాంగ్రెస్ సీట్ల పంపిణీ ఒప్పందం చేసుకోవాలని ఉత్తరప్రదేశ్ ఆర్ఎల్డీ ఉపాధ్యక్షుడు జయంత్ చౌదరి సూచించారు. ఇటీవల యూపీలో కైరానా లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ మద్దతుతో ఆర్ఎల్డీ నేత తబుస్సుమ్ హసన్ గెలుపొందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జయంత్ చౌదరి తాజా ప్రకటన చేయడం గమనార్హం.
‘‘సీట్ల పంపకం అన్నది ఉత్తరప్రదేశ్ లో చాలా క్లిష్టమైనది. ఇక్కడ నాలుగు పెద్ద ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి’’ అని చౌదరి చెప్పారు. బీజేపీని అడ్డుకునేందుకు అన్ని భాగస్వామ్య పక్షాలు కలసి కట్టుగా సాగాలన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట వాటికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట దానికి ప్రాంతీయ పార్టీలు మద్దతుగా నిలవాలన్నారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలని, అయితే, అన్ని పార్టీలూ ఇదే మార్గమనే విషయాన్ని గుర్తిస్తాయని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో ఇప్పటికే ఇది సాధ్యం అయిందని. జేడీఎస్, కాంగ్రెస్ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని పేర్కొన్నారు. ఇదే విధంగా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్, బీఎస్పీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు.