IPL: ఐపీఎల్ బెట్టింగ్ మిస్టరీ... ఇద్దరు బార్ గర్ల్స్, ఏడుగురు బాలీవుడ్ సెలబ్రిటీలు... తవ్వే కొద్దీ బయటకొస్తున్న నిజాలు!
- సోనూ క్లయింట్లుగా 1,200 మంది
- సోనూ లాంటి వాళ్లను 100 మందిని నియమించుకున్న 'జూనియర్ కోల్ కతా'
- ఇప్పటికే దేశం దాటెళ్లిన 'జూనియర్ కోల్ కతా'
ఐపీఎల్ తాజా సీజన్ లో బెట్టింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతున్న ముంబై పోలీసులకు ఈ రాకెట్ వెనుక ఉన్న మరింత మంది పేర్లు బయటకు వస్తున్నాయి. బెట్టింగ్ రాకెట్ గురించి సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో పాటు సోనా జలన్ అలియాస్ సోనూ మలాద్ ను విచారించగా, పోలీసులకు మరిన్ని కొత్త వివరాలు తెలిసినట్టు సమాచారం.
పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, అర్భాజ్ ఏడుగురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెల్లడించాడు. దాదాపు 5 గంటలకు పైగా పోలీసు విచారణను ఎదుర్కొన్న ఆయన, చెప్పిన పేర్లు విని పోలీసులు షాకయ్యారు. ఇక సోనూ జలన్ ను విచారించగా, కోమల్, గాయత్రి అనే ఇద్దరు బార్ డ్యాన్సర్లతో తాను సిండికేట్ అయి దందాను నడిపించినట్టు చెప్పడంతో, వారిని నేడో రేపో అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు.
సెలబ్రిటీలతో మాట్లాడేవేళ, సోనూ ఆ దృశ్యాలను, మాటలను తన సెల్ ఫోన్ లో రికార్డు చేసేవాడని, ఆపై వారిని బెదిరించేవాడని కూడా పోలీసులు తేల్చారు. సోనూ క్లయింట్లుగా హై-ప్రొఫైల్ వ్యక్తులున్నారని, అర్భాజ్ ను కూడా బెదిరించే సోనూ తన సిండికేట్ లో చేర్చుకున్నాడని చెప్పారు. సోనూ క్లయింట్లుగా 1,200 మంది ఉన్నారని, ఈ సోనూ లాంటి వాళ్లను దేశవ్యాప్తంగా 100 మందిని 'జూనియర్ కోల్ కతా' నియమించుకున్నాడని తెల్సింది.
'జూనియర్ కోల్ కతా' డైరెక్టుగా అండర్ వరల్డ్ తో సంబంధాలను కలిగివున్నాడని, బెట్టింగ్ రాకెట్ బయటకు రాగానే అతను దేశాన్ని వదిలి పారిపోయాడని అనుమానిస్తున్నామని వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఆరుగురిని అరెస్ట్ చేశామని ధ్రువీకరించిన ముంబై క్రైమ్ బ్రాంచ్, మరికొందరిని విచారిస్తున్నామని, సోనూ జలన్ విచారణలో అర్బాజ్ ఖాన్ పేరు చెప్పాడని, ఆయన్ను విచారించి స్టేట్ మెంట్ ను రికార్డు చేశామని డీసీపీ అభిషేక్ త్రిముఖే తెలియజేశారు.