Pawan Kalyan: టీడీపీ ఇలాగే చేస్తే నిజంగానే రెచ్చగొడతాను!: పవన్‌ కల్యాణ్‌

  • దోపిడీలు కొనసాగిస్తే ఊరుకోను
  • టీడీపీ నేతలు దోపిడీ ఎలా చేస్తారో చూస్తా
  • నేను బీజేపీ స్క్రిప్టు చదవడం లేదు

తాను ప్రజలను రెచ్చగొడుతున్నానని, బీజేపీ రాసిచ్చిన స్క్రిప్టు చదువుతున్నానని టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఈరోజు విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... తాను ప్రజలను రెచ్చగొట్టేవాడిని కాదని, నిజాలు చెప్పేవాడినని అన్నారు. ఇలాగే దోపిడీ చేస్తూ ప్రజలకు నష్టం చేకూర్చే విధానాలను అవలంబిస్తే కనుక తాను చేతులు కట్టుకుని కూర్చునేవాడిని కాదని అన్నారు.  

అయితే, టీడీపీ నేతలు ఇలాగే దోపిడీని కొనసాగిస్తే తాను నిజంగానే రెచ్చగొడతానని, టీడీపీ నేతలు దోపిడీ ఎలా చేస్తారో చూస్తానని పవన్‌ అన్నారు. కాగా, బీజేపీ స్క్రిప్టు రాసిస్తే తాను చదువుతున్నానని కొందరు చేస్తోన్న ఆరోపణలపై పవన్‌ మాట్లాడుతూ.. వారు రాసిస్తే చదవడానికి తాను వ్యక్తిత్వం లేని వాడిని కాదని అన్నారు. అలాగే తాను మాటలు మార్చే వ్యక్తిని కాదని, ఎప్పుడూ ఒకే మాటపై ఉంటానని అన్నారు. తనకూ బీజేపీకి సంబంధమే లేదని స్పష్టం చేశారు.
 
టీడీపీ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతోందని, మరోవైపు సింగపూర్‌ తరహా అభివృద్ధి అని అంటోందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సింగపూర్‌లో మతం, కులం, ప్రాంతాలకి ప్రాధాన్యత ఇవ్వరని, అక్కడ అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తారని, పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారని అన్నారు. కానీ టీడీపీ నేతలు అలా కాదని, అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

ప్రజలకు మంచి సౌకర్యాలు కూడా కల్పించలేకపోతున్నారని, తుపాన్ల నుంచి కూడా రక్షణ కల్పించలేకపోతున్నారని పవన్‌ విమర్శించారు. భోగాపురంలో భూములు తీసుకున్నారు కానీ, అభివృద్ధి మాత్రం చేయట్లేదని అన్నారు. భూములు లాక్కోవడంలో చూపించిన ఆసక్తి, అభివృద్ధి చేయడంలో చూపడం లేదని విమర్శించారు.

Pawan Kalyan
Jana Sena
Vijayanagaram District
  • Loading...

More Telugu News