KCR: ఇదిగిదుగో బంగారు తెలంగాణ: కేసీఆర్

  • తెలంగాణలో వైభవంగా రాష్ట్రావతరణ వేడుక
  • పెరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ ప్రసంగం
  • అభివృద్ధి, సంక్షేమం గురించిన వివరాలు

రైతుబంధు, జీవిత బీమా, కాళేశ్వరం ప్రాజెక్టు, ఉచిత వైద్య పరీక్షలు, అన్ని వర్గాల వారికీ సంక్షేమ పథకాలతో బంగారు తెలంగాణ అతి త్వరలోనే వచ్చేయనుందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రసంగించిన కేసీఆర్, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, భవిష్యత్తులో జరిగే అభివృద్ధిని గురించి ప్రస్తావించారు.

సంపద సృష్టించి, ఆ సంపదను ప్రజలకు పంచాలన్న సూత్రం ప్రాతిపదికన రాష్ట్రం పురోగమిస్తున్నదని చెప్పిన కేసీఆర్, సకలజనుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన ప్రతి అమర వీరుడికీ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పిస్తున్నట్టు చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం, గడచిన నాలుగేళ్లుగా బలమైన అడుగులు వేశామని, ప్రతి వర్గంలోని ప్రజల భవిష్యత్తూ, ఉజ్వలంగా ఉండేలా ప్రవేశపెట్టిన పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు.

ఆంధ్రా పాలకుల చేతుల్లో దారుణమైన అణచివేతకు, దోపిడీకి గురైన రాష్ట్రంలో వెనుకబాటుతనం ఆవహించిన వేళ, ప్రజల్లో నిరాశా, నిస్పృహలు పెరిగిపోయిన సమయంలో ఓ పెను ఉద్యమంతో స్వరాష్ట్ర సాధన కల సాకారమైందని చెప్పిన కేసీఆర్, ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, కడగండ్లు ఒక్కొక్కటిగా తీరుతున్నాయని అన్నారు. ప్రజల కోరికల పునాదులపైనే మానిఫెస్టోను రూపొందించి, ఎన్నికల్లో విజయం సాధించామని చెప్పిన కేసీఆర్, ఆ మరుసటి క్షణం నుంచే హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని, ఎన్నో దశాబ్దాల పోరాటానికి దక్కిన ఫలితం ఇదని అన్నారు. 40 సంవత్సరాల పాటు పడిన కష్టాలను నాలుగేళ్లలో ప్రజలు మరచిపోయేలా చేశామని అన్నారు. ఎన్నో రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు, అధికారులు తెలంగాణకు వచ్చి ఇక్కడి పథకాలను పరిశీలించి మెచ్చుకున్నారని, సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలు, రైతులు తమను తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి వచ్చిందని చెప్పారు. ప్రజా సంక్షేమంలో తెలంగాణ రోల్ మోడల్ అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏంటని ప్రశ్నించారు. ఆదాయాభివృద్ధిలో 21 శాతం పెరిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని గుర్తు చేశారు. ఇండియాలో మరే రాష్ట్రంలోనూ జరగని అభివృద్ధిని చేసి చూపిస్తున్నామని కేసీఆర్ చెప్పారు.

  • Loading...

More Telugu News