ramaprabha: ఏఎన్నార్ చివరి చూపు దక్కడం కోసమే అలా జరిగింది: రమాప్రభ
- డబ్బింగ్ పనిమీద హైదరాబాద్ వెళ్లాను
- అక్కినేని చనిపోయారని తెలిసింది
- కడసారి చూపుల కోసం వెళ్లాను
తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో రమాప్రభ మాట్లాడుతూ .. అక్కినేని నాగేశ్వరరావు గురించి చెబుతూ ఉద్వేగానికి లోనయ్యారు. "నాగేశ్వరరావు గారు చనిపోవడానికి ముందురోజు ఒక చిన్న కంపెనీ వాళ్లు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి డబ్బింగ్ చెప్పడానికి రమ్మన్నారు. అందుకు కావాల్సిన టికెట్స్ బుక్ చేశారు. ఆ రాత్రే బయలుదేరి మరుసటి రోజు ఉదయానికి నేను హైదరాబాద్ చేరుకున్నాను. అక్కడి గెస్ట్ హౌస్ లో దిగి టీవీ చూస్తున్నప్పుడు నాగేశ్వరరావుగారు చనిపోయినట్టుగా తెలిసింది.
ఆ షాక్ లో నాకు ఏడుపు కూడా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలా అని నేను ఆలోచిస్తూ ఉండగా, వాణిశ్రీ నాకు ఫోన్ చేసింది. నేను ఎక్కడ వున్నది చెప్పడంతో .. అక్కడికి వచ్చి నన్ను తీసుకుని వెళ్లింది. అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లిన నాకు చిన్న చిన్న అవమానాలు జరిగినా పెద్దగా పట్టించుకోలేదు. మా నాగేశ్వరరావుని చివరిసారిగా చూసుకున్నాను. నన్ను డబ్బింగ్ కి రమ్మని ఫోన్ చేసిన వాళ్లు .. డబ్బు పంపించిన వాళ్లు .. టికెట్స్ బుక్ చేసిన వాళ్లు ఆ తరువాత కూడా కాంటాక్ట్ లోకి రాలేదు. నాగేశ్వర రావును చివరిసారిగా నేను చూడాలని వుంది .. ఆయన ఆత్మే నన్ను అలా హైదరాబాద్ కి చేరుకునేలా చేసింది. నాగేశ్వరరావు గారితో నాకున్న ఆత్మ సంబంధమైన అనుబంధం అలాంటిది" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.