Indian-American: కాలిఫోర్నియా గవర్నర్ రేసులో 22 ఏళ్ల భారతీయ అమెరికన్.. వినూత్న ప్రచారంతో దూసుకుపోతున్న టెక్కీ!
- ప్రచారంలో దూసుకుపోతున్న శుభమ్
- వర్చువల్ రియాలిటీ టెక్నాలజీతో ఓటర్లను ఆకర్షిస్తున్న వైనం
- తననెందుకు ఎన్నుకోవాలో వివరిస్తున్న ఐటీ నిపుణుడు
అమెరికాలో భారత కీర్తి పతాకను ఎగరేసేందుకు మరో భారతీయ అమెరికన్ సిద్ధమయ్యాడు. 22 ఏళ్ల ఐటీ నిపుణుడు శుభమ్ గోయల్ కాలిఫోర్నియా గవర్నర్ పదవి కోసం పోటీ పడుతున్నాడు. ఉత్తరప్రదేశ్ మూలాలున్న శుభమ్ మెగాఫోన్ పట్టుకుని కాలిఫోర్నియా వీధుల్లో నిర్వహిస్తున్న ప్రచారం అందరినీ ఆకర్షిస్తోంది.
డెమొక్రటిక్ గవర్నర్ జెర్రీ బ్రౌన్ కంటే తానెంత మెరుగైన వ్యక్తినో చెబుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. ఐటీలో తనకున్న నైపుణ్యాన్ని ఇందుకోసం ఉపయోగించుకుంటున్నాడు. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాడు. ‘‘వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చేస్తుందనడంలో సందేహం లేదు. కాలిఫోర్నియాలో విద్యాపరమైన సమస్యలను ఇది పరిష్కరిస్తుంది’’ అని శుభమ్ పేర్కొన్నారు.
శుభమ్ తల్లి కరుణ గోయల్ మీరట్‌కు చెందిన వారు కాగా, తండ్రి విపుల్ గోయల్‌కు లక్నోలో సొంత సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. శుభమ్ కాలిఫోర్నియాలో యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్లో పట్టభద్రుడయ్యాడు. గత అక్టోబరు నుంచి ఉద్యోగం చేస్తున్నాడు.