Facebook: 'ట్రెండింగ్' ఫీచర్ ను తొలగించనున్న ఫేస్ బుక్!
- కొత్త వార్తలకు అడ్డుగా 'ట్రెండింగ్' ఫీచర్
- 2014లో ప్రారంభమైన ఫీచర్
- తొలగిస్తున్నామని చెప్పిన అలెక్స్ హర్డిమాన్
సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ లోని 'ట్రెండింగ్' ఫీచర్ ఇకపై కనిపించబోదు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ స్వయంగా తెలిపింది. ఈ ఫీచర్ కొన్ని సాంకేతిక సమస్యలను సృష్టిస్తోందని, కొత్త వార్తలు కనిపించడానికి అడ్డుగా ఉందన్న ఫిర్యాదులు వెల్లువెత్తడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ న్యూస్ ప్రొడక్ట్స్ హెడ్ అలెక్స్ హర్డిమాన్ వెల్లడించారు.
2014లో ఈ ఫీచర్ ను ప్రారంభించామని, ఫేస్ బుక్ లో ఆకర్షణీయమైన టాపిక్స్ ను సులువుగా వెతుక్కునే సదుపాయాన్ని ఈ ఫీచర్ దగ్గర చేసిందని గుర్తు చేసిన ఆమె, ఆపై మారిన పరిస్థితుల నేపథ్యంలో, వీడియో న్యూస్ కు ఆదరణ పెరిగిందని చెప్పారు. ఇదే సమయంలో కొత్తగా వచ్చే వార్తలను అడ్డుకుంటున్న 'ట్రెండింగ్' ఫీచర్ వద్దని ఫీడ్ బ్యాక్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె వెల్లడించారు.
ఈ సెక్షన్ కస్టమర్లకు తలనొప్పిగా మారిందని, సంప్రదాయ వార్తలను ట్రెండింగ్ న్యూస్ అధిగమిస్తున్నాయని 'గిజ్మోడో' 2016లో సంచలన నివేదికను బయటపెట్టిన తరువాత, ఫేస్ బుక్ 'ట్రెండింగ్' ఫీచర్ పై ఖాతాదారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. ఈ ఫీచర్ ను తొలగించే అవకాశాలు ఉన్నాయని ఇటీవలే సంస్థ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే.