Hyderabad: ఫిలిం ఎడిటర్ పాడు బుద్ధి.. మహిళతో చాటింగ్ చేయించి మోసం!
- మహిళతో కలిసి చాటింగ్ ద్వారా మోసం
- ప్రేమగా మాట్లాడి రూ.2 లక్షలు కొట్టేసిన వైనం
- బాధితుడి ఫిర్యాదుతో నిందితుల అరెస్ట్
ఈజీ మనీ కోసం సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి మోసాలకు పాల్పడుతున్న ఫిలిం ఎడిటర్ కటకటాలపాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. చింతల్‌కు చెందిన సలిమిడి నవీన్ రెడ్డి ఓ సంస్థలో ఫిలిం ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. వివాహమై ఇద్దరు పిల్లలున్నా, మరో మహిళతో సహజీవనం చేస్తూ అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. రెండు కుటుంబాలను పోషించడం కష్టంగా మారడంతో ఈజీ మనీ కోసం నవీన్ రెడ్డి ప్లాన్ వేశాడు.
సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి సోషల్ మీడియాలో చాటింగ్ చేసి అమాయకులను బుట్టలో పడేయడం ద్వారా డబ్బులు సంపాదించాలని పథకం వేశాడు. అదే సమయంలో ఓ చాట్ రూం వెబ్‌సైట్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ కనిపించడంతో రంగంలోకి దిగాడు. మహిళతో చాటింగ్ చేయించాడు. తర్వాత అతడి నెంబరు తీసుకుని వాట్సాప్‌లోనూ చాటింగ్ మొదలుపెట్టారు. ప్రేమగా మాట్లాడుతూ మొత్తానికి అతడిని బుట్టలో పడేశారు. ఈ క్రమంలో తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమయ్యాయని, రెండుమూడు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికి ఆమె రూ.20వేలు తీసుకుంది.
కొన్ని రోజుల తర్వాత తన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితుడు ఒత్తిడి తీసుకురావడంతో విజయవాడలో ఉన్న తన స్థలాన్ని విక్రయిస్తున్నానని, రిజిస్ట్రేషన్ కోసం రూ.2 లక్షలు అవసరముందని, ఆ డబ్బులు సర్దితే రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మొత్తం డబ్బులు ఇచ్చేస్తానని చెప్పింది. దీంతో రూ.1.80 లక్షలను ఆమె బ్యాంకు ఖాతాలో వేశాడు. ఆ తర్వాతి నుంచి ఆమె ఫోన్ నంబరు పనిచేయడం మానేసింది. దీంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.