Andhra Pradesh: ఏపీ సీఎస్‌తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ

  • అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలి
  • రుణం మంజూరు చేయాలి
  • సాధ్యమైనంత త్వరగా డాక్యుమెంటేషన్ పూర్తి చేయాలని కోరిన సీఎస్  

అమరావతి రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయల కల్పనకు త్వరగా రుణం మంజూరు చేయాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ కోరారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఈరోజు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఆయనను కలిశారు. రాజధాని ప్రాంతం సీఆర్డీఏ పరిధిలో తమ బ్యాంకు ఆధ్వర్యంలో చేపట్టబోయే మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన రుణంపై వారు సీఎస్ తో చర్చించారు.

రాజధాని నిర్మాణంలో మౌలిక సదుపాయాల కల్పన ముఖ్యమని సీఎస్ తెలిపారు. దీనికి ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చి, మౌలిక సదుపాయాల కల్పనకు రుణమివ్వడానికి అంగీకరించడం హర్షించతగ్గ విషయమన్నారు. సాధ్యమైనంత త్వరగా డాక్యుమెంటేషన్ పూర్తి చేసి రుణం మంజూరు చేయాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను సీఎస్ కోరారు.

రాజధాని నిర్మాణంలో పనిచేస్తోన్న కూలీలకు కల్పిస్తున్న సదుపాయాలపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సంతృప్తి వ్యక్తంచేశారు. రాజధాని ప్రాంతంలోని వెంకయ్యపాలెం, కృష్ణయ్యపాలెం రాయపూడి గ్రామాల్లో భూముల్లేని నిరుపేదలతోనూ మాట్లాడినట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.  

Andhra Pradesh
cs
world bank
  • Loading...

More Telugu News