BJP: ఉప ఎన్నికల్లో బోల్తా పడుతున్న బీజేపీ!

  • గత నాలుగేళ్లలో 27 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు
  • బీజేపీ గెలిచింది ఐదింటిలోనే
  • సిట్టింగ్ స్థానాలను సైతం కోల్పోతున్న కమలం

బీజేపీని ఇప్పుడో సమస్య వేధిస్తోంది. ఎన్నికల్లో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న ఆ పార్టీ ఉప ఎన్నికల గండం నుంచి మాత్రం బయటపడలేకపోతోంది. గత నాలుగేళ్లుగా జరిగిన ఉప ఎన్నికలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. 2014 నుంచి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ ప్రభావం నామమాత్రమే అవుతోంది. ఇప్పటి వరకు 27 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా కేవలం 5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.

తాజాగా గురువారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాల్లోనూ ఆ గండం నుంచి బీజేపీ గట్టెక్కలేకపోయింది. ఓ లోక్‌సభ, ఓ శాసనసభ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. మిగతావన్నీ ప్రాంతీయ పార్టీల ఖాతాల్లోకి వెళ్లాయి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఉప ఎన్నికలు జరిగిన 27 స్థానాల్లో 13 సీట్లు బీజేపీ సిట్టింగ్ సీట్లు కావడం గమనార్హం. 2014, 2016 ఉప ఎన్నికల్లో రెండేసి స్థానాలను బీజేపీ గెలుచుకోగా, తాజాగా ఒకటి గెలుచుకుంది. 2015, 2017 ఉప ఎన్నికల్లో ఒక్క దాంట్లోనూ కమలం వికసించలేదు.

ఈ ఏడాది పరిస్థితి మరింత దిగజారింది. ఎనిమిది సిట్టింగ్ స్థానాల్లో ఆరింటిని కోల్పోయింది. ఆ పార్టీ కంచుకోటలుగా చెప్పుకునే గోరఖ్‌పూర్, ఫల్పూర్, అజ్మీర్, అల్వార్, కైరానా, భండారా-గోండియా లోక్‌సభ స్థానాలను బీజేపీ నుంచి ప్రతిపక్షాలు లాగేసుకున్నాయి. గత నాలుగేళ్లలో కాంగ్రెస్ గెలుచుకున్న ఐదు స్థానాల్లో నాలుగు బీజేపీవి కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News