BJP: వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. బీజేపీకి భారీ ఎదురుదెబ్బ!

  • ఉప ఎన్నికల్లో తగ్గిన బీజేపీ ఓట్ల శాతం
  • ఆందోళనలో బీజేపీ అధిష్ఠానం
  • పుంజుకుంటున్న ప్రతిపక్షాలు

గురువారం విడుదలైన ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి కొరుకుడు పడడం లేదు. దేశవ్యాప్తంగా నాలుగు లోక్‌సభ, పది శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ బొక్కబోర్లా పడింది. నాలుగు లోక్‌సభ స్థానాల్లో మహారాష్ట్రలోని పాల్ ఘర్‌ను బీజేపీ సొంతం చేసుకోగా, నాగాలాండ్‌ స్థానాన్ని మిత్రపక్షమైన ఎన్‌డీడీపీ కైవసం చేసుకుంది. ఇక పది అసెంబ్లీ స్థానాల్లో ఉత్తరాఖండ్‌లోని థరాలి స్థానంలో మాత్రమే బీజేపీ విజయం సాధించింది.

ప్రతిపక్షాల ఐక్యతకు ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనంగా కనిపిస్తున్నట్టు బీజేపీలోనే గుసగుసలు వినిపిస్తుండగా, నిజానికి బీజేపీ సీట్లతో పాటు ఓట్లనూ కోల్పోయిందన్న వాస్తవం అధిష్ఠానాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని కైరానాలో గత ఎన్నికల్లో బీజేపీకి 50.6 శాతం ఓట్లు వచ్చాయి. తాజా ఉప ఎన్నికల్లో అది 45.7 శాతానికి పడిపోయింది. ఉప ఎన్నికల్లో ఈసారి ఆ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది.

ఈ ఏడాది మొదట్లో గోరఖ్‌పూర్, ఫల్పూర్‌లో బీజేపీ 46.5 శాతం ఓట్లు మాత్రమే సొంతం చేసుకోగలిగింది. రాజకీయ పరిశీలకుల విశ్లేషణ ప్రకారం.. తాజాగా జరిగిన పది అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ ఓట్ల శాతాన్ని గణనీయంగా కోల్పోయింది. పశ్చిమబెంగాల్‌లోని మహెస్తలలో మాత్రం కొంత వరకు పుంజుకోగలిగింది. ఇటీవల పశ్చిమబెంగాల్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం కొంత మెరుగుపడింది. ఉత్తరప్రదేశ్‌లోని నూర్‌పూర్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ.39 శాతం ఓట్లు రాగా, ఇప్పుడది 47.2 శాతానికి పెరిగింది.

నాగాలాండ్‌లో గత ఎన్నికల్లో బీజేపీకి 68.7 శాతం ఓట్లు రాగా, తాజాగా 41.3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. పాల్ ఘర్‌లో బీజేపీ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది.  ఇక్కడ బీజేపీ గెలిచినప్పటికీ ఓట్ల శాతం 30.8కి పడిపోయింది. గత ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీకి 53.7 శాతం ఓట్లు వచ్చాయి. భండారా-గోండియాలోనూ బీజేపీకి ఇదే పరిస్థితి ఎదురైంది. గత ఎన్నికల్లో 50.6 శాతం ఓట్లు రాగా, ఈసారి 41.5 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. ఇక్కడ ఎన్సీపీ గణనీయమైన ఓట్లు సాధించింది. 2014 ఎన్నికల్లో 14.3 శాతం ఓట్లు మాత్రమే సంపాదించుకున్న ఎన్సీపీ ఈసారి ఏకంగా 46.6 శాతం ఓట్లు కొల్లగొట్టింది. ఆయా అసెంబ్లీ స్థానాల్లోనూ తన ఓట్ల శాతం భారీగా పడిపోవడం బీజేపీకి ఎదురుదెబ్బేనని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ తాజా తీర్పు బీజేపీకి మింగుడుపడడం లేదు.

  • Loading...

More Telugu News