uddav: ఎన్నికల కమిషన్‌లో అవినీతి.. దేశంలోని పార్టీలన్నీ ఏకం కావాలి: ఉద్ధవ్ ఠాక్రే
- పాల్‌ఘర్ ఎన్నికల కౌంటింగ్‌లో వ్యత్యాసాలు
- అవసరమైతే న్యాయస్థానానికి వెళతాం
- దేశ ప్రజాస్వామ్యం చాలా ప్రమాదంలో పడింది
- పోలింగ్‌కు ఒకరోజు ముందు బీజేపీ భారీగా డబ్బు పంపిణీ
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత రాష్ట్రంలోనే ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించలేకపోయారని, మరోవైపు మహారాష్ట్రకు వచ్చి ప్రచారం చేశారని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఈరోజు ముంబయిలోని శివసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తమ రాష్ట్రంలోని పాల్‌ఘర్ లోక్‌సభ స్థానంలో ఎన్నికల కౌంటింగ్‌లో వ్యత్యాసాలు వచ్చాయని, ఎందుకు అలా జరుగుతోందో తెలిసే వరకు ఫలితాలు వెల్లడించకూడదని డిమాండ్ చేశారు.
అవసరమైతే తాము న్యాయస్థానానికి వెళతామని, మన దేశ ప్రజాస్వామ్యం చాలా ప్రమాదంలో పడిందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. పోలింగ్‌కు ఒక రోజు ముందు బీజేపీ భారీగా డబ్బు పంపిణీ చేసిందని అన్నారు. ఎలక్షన్ కమిషన్‌లోనూ అవినీతి కనపడుతోందని, దేశంలోని బీజేపీయేతర పార్టీలన్నీ ఒక తాటిపైకి రావాలని, ఈసీకి వ్యతిరేకంగా కోర్టులో ఫిర్యాదు చేయాలని అన్నారు.
కాగా, ఎన్నికల ఫలితాలను వెల్లడించకూడదని శివసేన చేసిన డిమాండ్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. పాల్‌ఘర్‌లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గావిట్ గెలిచినట్లు ప్రకటించి, ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చింది.