Warangal Rural District: రైలుపట్టాలపై ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న ప్రేమజంట... కాపాడిన తెలంగాణ హోం గార్డు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-76337ba825d943bd7f92ff750324590189c1db21.jpg)
- వరంగల్ రైల్వే ట్రాక్ పై జంటను చూసిన హోం గార్డు
- బలవంతంగా పక్కకు లాగి కౌన్సెలింగ్
- ప్రేమజంటను కాపాడినందుకు అభినందనలు
ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో, ఆత్మహత్యకు సిద్ధమైన ఓ ప్రేమజంటను కాపాడిన తెలంగాణ హోంగార్డు రవిపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. నిన్న ఉదయం 10.30 గంటల ప్రాంతంలో వరంగల్ లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన ఓ యువజంట, హంటర్ రోడ్డు సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకుని నిలబడి వుండటాన్ని చూసిన రవి, వారు ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నారని గమనించాడు.
వెంటనే తన మొబైల్ ఫోన్ తో వారిని ఫొటో తీసి, వారిని ఆత్మహత్య చేసుకోవద్దని వారిస్తూ పరుగు తీసి, వారిని బలవంతంగా పట్టాలపై నుంచి పక్కకు లాగేశాడు. తాము గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నామని, ఇంట్లో పెళ్లికి అంగీకరించకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చామని వారు చెప్పడంతో, స్థానికులతో కలసి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపాడు. ప్రేమ జంటను కాపాడిన రవిని పలువురు అభినందించారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-863e06725456ac035c80c13ba0e11a0052fac90d.jpg)