Video Conference: చంద్రబాబు కీలక నిర్ణయాలు... 'హమ్మయ్య' అంటున్న అధికారులు!

  • నిత్యమూ కాన్ఫరెన్స్ లతో సతమతం అవుతున్న అధికారులు
  • ఇకపై వారానికి ఒక్క రోజు మాత్రమే కాన్ఫరెన్స్ లు
  • జన్మభూమి కమిటీలతో సంబంధం లేకుండానే పెన్షన్ లబ్దిదారుల ఎంపిక
  • వెలువడిన ఏపీ సర్కార్ ఆదేశాలు

ప్రతిరోజూ ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్, టెలీ కాన్ఫరెన్స్ లు, ఆపై మంత్రులు, కలెక్టర్ల పోటాపోటీ కాన్ఫరెన్సులు... ఇలా రోజంతా కాన్ఫరెన్స్ లకు సిద్ధమవడానికే సరిపోతుంటే, ఇక ప్రజల సంక్షేమం, విధుల నిర్వహణకు సమయం ఎక్కడుందని వాపోతున్న అధికారులకు కాస్తంత ఉపశమనం లభించింది. ఇకపై వారానికి ఒక్కరోజు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆపై పెన్షన్ లబ్దిదారుల ఎంపికలో జన్మభూమి కమిటీల ప్రమేయాన్ని తొలగిస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో అధికారులు 'హమ్మయ్య' అని ఊపిరి పీల్చుకుంటున్నారు.

మహానాడు ఆఖరి రోజున ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రసంగిస్తూ, టెలీ కాన్ఫరెన్స్ లతో అధికారులు పడుతున్న ఇబ్బందులను, జన్మభూమి కమిటీల వల్ల కలుగుతున్న నష్టాన్ని వివరించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే వీడియో, టెలీ కాన్ఫరెన్స్ లపై, జన్మభూమి కమిటీలపై ఈ ఆదేశాలు వెలువడటం గమనార్హం. జన్మభూమి కమిటీలతో సంబంధం లేకుండా పింఛను లబ్దిదారులను ఎంపిక చేయాలని, కొత్తగా 3.25 లక్షల మందికి నవనిర్మాణ దీక్ష తొలిరోజున లేఖలు అందించాలని చంద్రబాబు ఆదేశించారు. జూన్ 2 నుంచి 8 వరకూ జరిగే గ్రామసభల్లో లబ్దిదారులను ఎంపిక చేసి, ఆపై 10వ తేదీన పింఛన్ ఇవ్వాలని సూచించారు.

ప్రస్తుతం పింఛన్ రావాలంటే, కేవలం అర్హతలు ఉంటే సరిపోదు. స్థానిక జన్మభూమి కమిటీ నుంచి అనుమతి లేఖ తేవాల్సివుంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు తెలుగు తమ్ముళ్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక లేఖను ఇచ్చేందుకు రెండు నుంచి 5 వేల వరకూ డిమాండ్ చేస్తున్నట్టు కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. మొత్తం 50 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నా, ఇంకా ఆరోపణలు వస్తుండటాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం, జన్మభూమి కమిటీల ప్రమేయాన్ని తొలగించారని తెలుస్తోంది.

Video Conference
Tele conference
JanmaBhoomi
Telugudesam
Chandrababu
Andhra Pradesh
  • Loading...

More Telugu News