Thoothukudi: మీరు ఎవరు?... సూపర్ స్టార్ రజనీకాంత్ ను ప్రశ్నించిన యువకుడు!

  • తూత్తుకుడిలో గాయపడిన వారికి రజనీ పరామర్శ
  • మీరు ఎవరు? అని అడిగిన బీకామ్ గ్రాడ్యుయేట్ సంతోష్ రాజ్
  • చిరునవ్వుతో వెళ్లిపోయిన రజనీకాంత్

తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ వద్దంటూ జరిగిన నిరసనల్లో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ యువకుడి నుంచి ఇబ్బందికరమైన ప్రశ్నను ఎదుర్కొన్నారు. తూత్తుకుడి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (టీఎంసీహెచ్)కి రజనీకాంత్ రాగా, ఓ యువకుడు రజనీని చూసి 'మీరు ఎవరు?' అని ప్రశ్నించడంతో ఆయన సహా అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

కె.సంతోష్ రాజ్ అనే 21 సంవత్సరాల బీకామ్ గ్రాడ్యుయేట్ ఈ ప్రశ్న వేశాడు. ఆల్ కాలేజ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ను స్థాపించి, స్టెరిలైట్ కు వ్యతిరేకంగా ఉద్యమం మరింత ఉద్ధృతంగా మారేందుకు కృషి చేశాడు. ఈ నెల 22వ తేదీన కలెక్టరేట్ ముట్డడికి సంతోష్ రాజ్ నేతృత్వంలోని విద్యార్థుల సమూహం కదలగా, ఆపై జరిగిన నిరసనల్లో ఆయన తలకు బలమైన గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇక తమను పరామర్శించేందుకు వచ్చిన వీఐపీలను సంతోష్ రాజ్ కావాలనే ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం తమిళనాడు మంత్రి కదంబూర్ సీ రాజు వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా అడిగాడు. ఆపై వచ్చిన పన్నీర్ సెల్వంనూ ప్రశ్నలతో విసిగించాడు. కాగా, 'మీరు ఎవరు?' అన్న ప్రశ్నకు రజనీకాంత్ చిరునవ్వే సమాధానంగా ముందుకు కదిలారని తెలుస్తోంది.

Thoothukudi
Rajanikanth
Tamilnadu
Who Are You?
  • Loading...

More Telugu News