Pawan Kalyan: పవన్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలి.. ఆయనను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు: లోకేష్
- కిడ్నీ సమస్య ఉన్న ప్రాంతాల్లో ఎన్నో చర్యలు చేపట్టాం
- లక్ష మందికి స్క్రీన్ టెస్టులను నిర్వహించాం
- చంద్రన్న సంచార వాహనాల ద్వారా డయాలసిస్ సేవలు అందిస్తున్నాం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని, కొందరు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నట్టుందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. కిడ్నీ సమస్య ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని, ఎన్టీఆర్ సుజల ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. 80 గ్రామాల్లోని 238 నివాస ప్రాంతాలకు తాగు నీటిని అందిస్తున్నామని తెలిపారు. 136 రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్లను ఏర్పాటు చేశామని చెప్పారు.
4 నెలల కాలంలో 15 మొబైల్ టీమ్స్ తో లక్ష మందికి స్క్రీన్ టెస్టులను నిర్వహించామని తెలిపారు. చంద్రన్న సంచార వాహనాల ద్వారా డయాలసిస్ సేవలను అందిస్తున్నామని చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ. 2500 పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. సోంపేటలో కొత్త ల్యాబ్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఉన్న నిజాలను తెలుసుకుని మాట్లాడాలని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు సూచించారు.