motkupalli: ఆ విషయాన్ని లోకేష్ పై ప్రమాణం చేసి చెప్పమనండి.. ఆత్మహత్య చేసుకుంటా!: మోత్కుపల్లి
- గవర్నర్ పదవి కావాలని నేను చంద్రబాబును అడగలేదు
- చంద్రబాబు అంత నీతిమాలిన వ్యక్తి మరెవరూ లేరు
- సింగపూర్, దుబాయ్ లలో అక్రమ సంపాదనను దాచుకుంటున్నారు
తనను గవర్నర్ ను చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబును తాను ఎన్నడూ అడగలేదని ఆ పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తాను గవర్నర్ పదవిని అడిగినట్టు ఆయన కుమారుడు లోకేష్ పై ప్రమాణం చేసి చెబితే, అవసరమైతే ఆత్మహత్య కూడా చేసుకుంటానని తెలిపారు. ఏపీలో చంద్రబాబును ఓడించాలని తిరుమల మెట్లు ఎక్కి, వేంకటేశ్వరస్వామిని వేడుకుంటానని చెప్పారు.
రాజకీయాల్లో చంద్రబాబు అంత నీతిమాలిన వ్యక్తి లేడని, టీడీపీ జెండా సిద్ధాంతాలు ఆయనకు తెలియవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో నిన్ను, నీ అనుచరుడు రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే...కాళ్ల బేరానికి రాలేదా? అని ప్రశ్నించారు. టీడీపీ నుంచి రేవంత్ వెళ్లిపోయాక ఆయనను ఏమీ అనవద్దని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకు చెప్పలేదా? అని అడిగారు.
ఎవరికీ అన్యాయం చేయని తనకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని మోత్కుపల్లి మండిపడ్డారు. కోట్లాది రూపాయల అక్రమ సంపాదనను సింగపూర్, దుబాయ్ లలో చంద్రబాబు దాచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు అక్రమ సంపాదనపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం ఏపీకి ప్రధాని మోదీ ప్రత్యేక హోదా ఇవ్వరని అన్నారు.