Pranab Mukherjee: ప్రణబ్ ఏం మాట్లాడతారబ్బా? ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్!
- జూన్ 7న ఆరెస్సెస్ స్నాతకోత్సవం
- ప్రత్యేక అతిథిగా ప్రణబ్
- ఆయన ఎక్కడైనా మాట్లాడుకోవచ్చన్న అభిషేక్ సింఘ్వీ
ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టంతా మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీపై ఉంది. జూన్ 7న నాగ్‌పూర్‌లో జరగనున్న ఆరెస్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొననున్న ఆయన ఏం మాట్లాడతారోనని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ విషయంపై మాట్లాడేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి టామ్ వడక్కన్ ‘నో కామెంట్’ అంటూ తప్పించుకున్నారు. అయితే, కాంగ్రెస్, ఆరెస్సెస్ భావజాలాలు రెండూ వేర్వేరని ఆయన పేర్కొన్నారు.
మరో అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. రాష్ట్రపతి పదవితో ఆయన రాజకీయాలను వదిలిపెట్టారని, ఆయన ఎక్కడైనా మాట్లాడుకోవచ్చని తేల్చి చెప్పారు. ఆయన ఏం మాట్లాడారు, తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏం చేశారు? అన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మరో కాంగ్రెస్ నేత సీకే జాఫర్ ఏకంగా ప్రణబ్‌కే లేఖ రాశారు. ఆయన నిర్ణయం తనను షాక్‌కు గురిచేసిందని వ్యాఖ్యానించారు.